తినాల్సిన పనిలేదు... చాక్లెట్‌ వాసనే శక్తినిస్తుందట!

Dark Chocolate aroma helps reduce hunger and cravings during workouts
  • చాక్లెట్‌ వాసనపై ఆసక్తికర అధ్యయనం
  • డార్క్‌ చాక్లెట్‌తో వ్యాయామ పనితీరు మెరుగుదల
  • సగటున 18 ఎక్స్‌టెన్షన్లు ఎక్కువ
  • ఆకలి, తినాలనే కోరిక తగ్గినట్లు గుర్తింపు
  • ఇంకా లోతైన పరిశోధనలు అవసరమన్న నిపుణులు
చాక్లెట్‌ తినకపోయినా.. దాని వాసన చూడడం వల్ల వ్యాయామంలో మెరుగైన ఫలితాలు రావొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా డార్క్‌ చాక్లెట్‌ వాసన చూస్తే ఎక్కువసేపు వ్యాయామం చేయగలిగారని, అదే సమయంలో ఆకలి కూడా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనం ‘ఫ్రాంటియర్స్‌ ఇన్‌ ఫిజియాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైంది.

ఏం చేశారు?
పరిశోధకులు 23 మంది ఆరోగ్యవంతమైన యువకులను ఎంపిక చేశారు. ప్రతి పరీక్షకు ముందు కనీసం 10 గంటలు ఆహారం తీసుకోకుండా ఉంచారు. తర్వాత వారికి 90 శాతం డార్క్‌ చాక్లెట్‌, 60 శాతం మిల్క్‌ చాక్లెట్‌, వాసనలేని నీటి నమూనాలను ఒక్కోటి 30 సెకన్ల పాటు వాసన చూపించారు. ఆ తర్వాత కాళ్ల కండరాలకు సంబంధించిన లెగ్‌ ఎక్స్‌టెన్షన్‌ వ్యాయామాన్ని అలసిపోయే వరకు చేయించారు. ప్రతి సెట్‌కు ముందు మళ్లీ అదే వాసన చూపించి ఆకలి, తినాలనిపించడం, కడుపు నిండిన భావన వంటి అంశాలను నమోదు చేశారు.

డార్క్‌ చాక్లెట్‌దే పైచేయి
డార్క్‌ చాక్లెట్‌ వాసన చూసిన వారు.. వాసనలేని గ్రూపుతో పోలిస్తే సగటున 18 లెగ్‌ ఎక్స్‌టెన్షన్లు ఎక్కువగా చేశారు. ఆశ్చర్యకరంగా.. వ్యాయామం కష్టంగా అనిపించలేదని కూడా తెలిపారు. అంతేకాదు ఆకలి, తినాలనే కోరిక తగ్గడంతో పాటు కడుపు నిండిన భావన కూడా ఎక్కువగా కనిపించింది. మిల్క్‌ చాక్లెట్‌ వాసన మాత్రం ఎక్కువ మందికి ఆహ్లాదకరంగా అనిపించినా.. ఆకలిని తగ్గించడంలో డార్క్‌ చాక్లెట్‌ స్థాయిలో ప్రభావం చూపలేదు.

లోతైన పరిశోధన అవసరం
వాసన.. మెదడులో ఆకలి, భావోద్వేగాలను నియంత్రించే వ్యవస్థలతో నేరుగా సంబంధం ఉండటం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హార్మోన్లు, మెదడు పనితీరును కూడా పరిశీలించలేదు. అందుకే ఈ ఫలితాలను అందరికీ వర్తింపజేయడానికి ఇంకా లోతైన పరిశోధనలు అవసరమని స్పష్టం చేశారు.
Advertisement
Dark Chocolate
Chocolate Smell
Exercise Performance
Appetite Suppression
Weight Loss Tips
Frontiers in Physiology

More Telugu News