రోడ్డుపై ఆగిపోయిన యువతి కారు.. జవాన్‌ చేసిన పని చూస్తే సెల్యూట్‌ కొట్టాల్సిందే!

Indian Army soldier Narendra pushes stalled EV to charging station
  • బ్యాటరీ అయి రోడ్డుపై ఆగిన అమ్మాయి ఈవీ
  • ఆర్మీ జవాన్‌ నరేంద్ర సాయం
  • కారును ఛార్జింగ్‌ స్టేషన్‌ వరకు తోసి సాయం
  • ఛార్జ్‌ అయ్యే వరకు అక్కడే ఉన్న జనాన్‌
  • జవాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
ఎలక్ట్రిక్‌ కారు బ్యాటరీ పూర్తిగా అయిపోవడంతో ఓ మహిళ రోడ్డుపై చిక్కుకుపోయింది. ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్న సమయంలో ఓ భారత ఆర్మీ జవాన్‌ చేసిన సాయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. ఈ ఘటనను బ్యూటీ, లైఫ్‌స్టైల్‌ కంటెంట్‌ క్రియేటర్‌ దీపికా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

దీపికా చెప్పిన వివరాల ప్రకారం.. ప్రయాణం ప్రారంభించే సమయానికి కారులో 60 శాతం బ్యాటరీ ఉంది. అది సరిపోతుందని భావించింది. అయితే తిరుగు ప్రయాణంలో బ్యాటరీ ఊహించిన దానికంటే వేగంగా తగ్గిపోయింది. మిగిలిన బ్యాటరీని ఆదా చేసేందుకు ఏసీ కూడా ఆఫ్‌ చేసింది. అయినా ప్రయోజనం లేకపోయింది. ఛార్జింగ్‌ స్టేషన్‌ కోసం వెతుకుతూ వెళ్లేలోపే బ్యాటరీ 2 శాతానికి పడిపోయి కారు పూర్తిగా ఆగిపోయింది.

అప్పుడు అక్కడే ఉన్న భారత ఆర్మీ జవాన్‌ నరేంద్రను దగ్గర్లోని ఛార్జింగ్‌ స్టేషన్‌ ఎక్కడ ఉందని అడిగింది. దారి చెప్పి వెళ్లిపోకుండా.. ఆయనే స్వయంగా కారును ఛార్జింగ్‌ స్టేషన్‌ వరకు తోసుకుంటూ వెళ్లారు. ఎండను కూడా లెక్కచేయకుండా సాయం చేశారని దీపికా తెలిపింది.

అంతటితో ఆయన వెళ్లిపోలేదు. కారు ఛార్జ్‌ అయ్యే వరకు దాదాపు అరగంట పాటు అక్కడే వేచి ఉన్నారు. తాను సురక్షితంగా తిరిగి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాతే తన పనికి వెళ్లారని దీపికా చెప్పింది. ఈ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని, యూనిఫామ్‌లో ఉన్న నిజమైన హీరో అంటూ ఆమె జవాన్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

ఈ వీడియో వైరల్‌గా మారింది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేసిన ఆర్మీ జవాన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మానవత్వంపై నమ్మకాన్ని మరింత పెంచుతాయని కామెంట్లు చేస్తున్నారు.
Advertisement
Indian Army Soldier Narendra
Deepika Sharma
Electric Car Battery
Indian Army Viral Video
Roadside Assistance
Humanity Viral Story

More Telugu News