దెయ్యాల ఇంట్లో ఒక్క రాత్రి... రూ.52 వేల జీతం! జపాన్‌లో వింత ఉద్యోగం

  • చాలాకాలం తర్వాత మృతదేహాలు బయటపడిన ఇళ్లను జపాన్‌లో ‘జికో బుక్కెన్‌’గా పిలుపు
  • వాటిలో ఉండడానికి, కొనడానికి ముందుకు రాని జనాలు
  • దీంతో కొత్త తరహా ఉద్యోగాలు ప్రవేశపెట్టిన రియల్‌ ఎస్టేట్‌ రంగం
  • ఒక రాత్రి ఇంట్లో ఉండి దెయ్యాలు లేవని ధ్రువీకరించడమే పని
దెయ్యాలు ఉన్నాయనే ప్రచారంతో ఖాళీగా పడి ఉన్న ఇళ్లకు అద్దెదారులు దొరకడం లేదు. ఈ సమస్యకు జపాన్‌లో వినూత్న పరిష్కారం కనిపెట్టారు. అలాంటి ఇళ్లలో ఒక రాత్రి గడిపితే 88 వేల యెన్‌ (సుమారు రూ.52 వేలు) చెల్లించే కొత్త ఉద్యోగం అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇళ్లలో ఎలాంటి అతీంద్రియ శక్తులు లేవని నిర్ధారించి కొనుగోలుదారులు, అద్దెదారుల్లో ఉన్న భయాన్ని తొలగించడమే దీని ఉద్దేశం.

‘జికో బుక్కెన్‌’ ఇళ్లు
హత్యలు, ఆత్మహత్యలు, అగ్నిప్రమాదాలు లేదా ఒంటరిగా మరణించిన వారి మృతదేహాలు చాలా రోజుల తర్వాత బయటపడిన ఇళ్లను జపాన్‌లో ‘జికో బుక్కెన్‌’గా పిలుస్తారు. అక్కడి చట్టాల ప్రకారం అలాంటి ఇళ్ల చరిత్రను కొనుగోలుదారులు, అద్దెదారులకు తప్పనిసరిగా చెప్పాలి. దీంతో చాలా మంది ఆ ఇళ్లలో ఉండేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా వేల సంఖ్యలో ఇళ్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి.

దెయ్యాలు లేవని సర్టిఫికెట్‌
ఈ ఉద్యోగం చేసే వారు రాత్రంతా ఆ ఇంట్లోనే ఉంటారు. కెమెరాలు, ఇతర పరికరాలతో ఇంటిని పర్యవేక్షిస్తారు. ఎలాంటి అసాధారణ ఘటనలు జరగకపోతే ఆ ఇంట్లో అతీంద్రియ కార్యకలాపాలు లేవని సర్టిఫికెట్‌ ఇస్తారు. కొన్ని సంస్థలు మరింత ముందుకెళ్లి.. నిజంగా అలాంటివి ఉన్నట్లు రుజువైతే పరిహారం కూడా చెల్లిస్తామని చెబుతున్నాయి.

ఖాళీ ఇళ్లకు పరిష్కారం
వృద్ధుల జనాభా పెరగడం, జననాల రేటు తగ్గడం, నగరాలకు వలసలు పెరగడం వల్ల జపాన్‌లో లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా ‘జికో బుక్కెన్‌’ ఇళ్లు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంటున్నాయి. అందుకే వాటిని సాధారణ ఇళ్లతో పోలిస్తే 20 నుంచి 50 శాతం తక్కువ ధరకు అమ్మడం లేదా అద్దెకు ఇస్తున్నారు. ఇళ్ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ ధరకే ఇల్లు దొరుకుతుండటంతో యువత కూడా ఇప్పుడు అలాంటి ఇళ్లపై ఆసక్తి చూపుతున్నారని ‘ది ఎకనమిస్ట్‌’ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ వింత ఉద్యోగం జపాన్‌లో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది.
Advertisement

More Telugu News