మోదీ దార్శనికతకు, భారతీయ ప్రతిభకు ప్రతీక: విక్రమ్-1 రాకెట్ విజయంపై పవన్ కల్యాణ్

Pawan Kalyan on Vikram 1 Rocket Success A Symbol of Modis Vision and Indian Talent
  • తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించిన స్కైరూట్
  • విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్
  • సరికొత్త ఆవిష్కరణల్లో ప్రపంచ దేశాల సరసన భారత్ నిలుస్తుందన్న పవన్

భారత అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ.. దేశంలోనే తొలిసారిగా ఒక ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థ 'స్కైరూట్' రూపొందించిన 'విక్రమ్-1' రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 'మిషన్ ఆగమన్' పేరుతో చేపట్టిన ఈ చరిత్రాత్మక ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అద్భుత విజయాన్ని సాధించిన శాస్త్రవేత్తలకు, స్టార్టప్ బృందానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.


అంతరిక్ష సాంకేతికత, సరికొత్త ఆవిష్కరణల్లో ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడానికి ఈ ప్రయోగం ఒక చక్కటి నిదర్శనమని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఈ విజయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన దార్శనికతకు, ఆయన అందిస్తున్న ప్రోత్సాహానికి దక్కిన ప్రతిఫలమని అభిప్రాయపడ్డారు.


స్పేస్ రీసెర్చ్ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానించడం ద్వారా దేశంలో సరికొత్త స్టార్టప్‌ల అభివృద్ధికి, యువతలో వ్యవస్థాపక స్ఫూర్తిని రగిలించడానికి కొత్త అవకాశాలు వచ్చాయన్నారు. పట్టుదల, వినూత్న ఆలోచనలు ఉంటే ప్రైవేట్ రంగంలోనూ అద్భుతాలు సృష్టించవచ్చని ఈ ప్రయోగం నిరూపించిందని, ఇది ప్రతి యువ భారతీయుడికి ఒక బలమైన సందేశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.


ఈ ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో ప్రైవేట్ రంగానికి వెన్నుదన్నుగా నిలిచిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పాత్రను పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. శాస్త్రీయ నైపుణ్యాన్ని అందిస్తూ యువతను ప్రోత్సహించడంలో ఇస్రో ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఈ అద్భుత రాకెట్‌ను తయారు చేసిన 'స్కైరూట్ ఏరోస్పేస్' బృందంతో పాటు ఇస్రో, ఇన్-స్పేస్ (IN-SPACe) సంస్థల శాస్త్రవేత్తలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయగాథ రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలిచి, అంతరిక్ష రంగంలో భారతదేశాన్ని మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Pawan Kalyan
Vikram 1 Rocket
Skyroot Aerospace
ISRO
Mission Agaman
Narendra Modi

More Telugu News