లిఫ్ట్‌లో అరగంట పాటు చిక్కుకున్న శశిథరూర్.. హైడ్రాలిక్ స్పైడర్ పరికరంతో తలుపులు తీసిన రెస్క్యూ టీమ్
- తిరువనంతపురంలోని హోటల్ లిఫ్ట్ లో చిక్కుకుపోయిన శశిథరూర్
- తలుపులు తెరిచిన అగ్నిమాపక, రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది
- నవ్వుతూ లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన థరూర్
కేరళ రాజధాని తిరువనంతపురంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్‌కు ఒక ఊహించని ప్రమాదం ఎదురైంది. నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్‌కు వెళ్లిన ఆయన అక్కడ సాంకేతిక లోపంతో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. రోటరీ క్లబ్ ఆఫ్ త్రివేండ్రం ఈస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక అధికారిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు శశిథరూర్ అక్కడికి చేరుకున్నారు. అయితే లిఫ్ట్ ఎక్కిన కొద్దిసేపటికే అది మధ్యలో ఆగిపోవడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.
లిఫ్ట్ ఆగిపోయిన వెంటనే రంగంలోకి దిగిన హోటల్ సిబ్బంది, ఇనుప రాడ్ల సహాయంతో తలుపులు తెరిచేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక, రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. లిఫ్ట్ లోపల గాలి ఆడక ఇబ్బంది పడే పరిస్థితి రావడంతో రెస్క్యూ టీమ్ తమ వద్ద ఉన్న ఆధునిక 'హైడ్రాలిక్ స్ప్రెడర్' పరికరాన్ని ఉపయోగించి అత్యంత చాకచక్యంగా లిఫ్ట్ తలుపులను విడదీశారు. అలా శశిథరూర్‌తో పాటు ఆయనతో ఉన్న మరో ఎనిమిది మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
లిఫ్ట్ తలుపులు తెరుచుకుని సురక్షితంగా బయటకు రాగానే శశిథరూర్ ఏమాత్రం కంగారు పడకుండా చిరునవ్వుతో రెస్క్యూ టీమ్‌కు అభివాదం చేశారు. క్లిష్ట సమయంలో అద్భుతంగా పనిచేసి కాపాడినందుకు అగ్నిమాపక సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ చేదు అనుభవంపై ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. లిఫ్ట్‌లో అరగంట పాటు చిక్కుకుపోవడం తనకు పెద్ద సమస్యగా అనిపించలేదని, కాకపోతే ఈ ప్రమాదం వల్ల ఆ తర్వాత తాను హాజరుకావాల్సిన రెండు ముఖ్యమైన సమావేశాలకు ఆలస్యం కావడమే కాస్త ఇబ్బంది కలిగించిందని శశిథరూర్ పేర్కొన్నారు.