ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. 20 రోజులుగా దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్!

Tension at Delhi Jantar Mantar as Sonam Wangchuk arrested after 20 days of hunger strike
  • నీట్ పేపర్ లీక్‌పై విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్
  • దీక్ష వల్ల 8 కేజీల బరువు తగ్గిన 59 ఏళ్ల వాంగ్‌చుక్
  • ప్రాణాలు కాపాడాలన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో పోలీసుల చర్య
  • వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • జులై 20న పార్లమెంట్ మార్చ్‌కు నిరసనకారుల పిలుపు
దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా సాగుతున్న సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష శనివారం తెల్లవారుజామున ఊహించని మలుపు తిరిగింది. ‘నీట్’ పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో 59 ఏళ్ల పర్యావరణ, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఈ కఠిన దీక్షకు దిగారు. ఈ నిరసనలకు మద్దతుగా నిలుస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తల తీవ్ర నినాదాల మధ్య, పోలీసులు ఆయనను బలవంతంగా దీక్షా శిబిరం నుంచి తరలించి ఆసుపత్రిలో చేర్చారు.

వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో జరిగిన విచారణ ఈ పరిణామానికి దారితీసింది. "ఏ పౌరుడి ప్రాణమైనా అత్యంత విలువైంది" అని పేర్కొన్న హైకోర్టు.. వాంగ్‌చుక్ ప్రాణాలను కాపాడటానికి అవసరమైన అన్ని వైద్య చర్యలు తీసుకోవాలని, రోజువారీ నివేదికలు సేకరించాలని కేంద్ర ప్రభుత్వానికి రెండు రోజుల క్రితమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఆయనను పరీక్షించిన వైద్యులు.. అవయవాలు విఫలమయ్యే (ఆర్గన్ ఫెయిల్యూర్) ప్రమాదం ఉందని, పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని హెచ్చరించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తాము కోర్టు ఆదేశాల మేరకే ఈ చర్య తీసుకుంటున్నట్లు మైకుల ద్వారా అనౌన్స్ చేశారు.

20 రోజులుగా కొనసాగుతున్న ఈ సుదీర్ఘ దీక్ష వల్ల వాంగ్‌చుక్ ఏకంగా 8 కేజీల బరువు తగ్గారు. ఆయన ఆరోగ్యం విషమిస్తుండటంతో గత రెండు రోజులుగా ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తదితరులు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా దీక్ష విరమించాలని కోరారు. అయితే, ఆసుపత్రిలోనూ నిరసన కొనసాగుతున్న తరుణంలో, జులై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజున 'పార్లమెంట్ మార్చ్' నిర్వహిస్తామని నిరసనకారులు ప్రకటించారు. ఈ మార్చ్‌లో అన్ని రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలని వారు విజ్ఞప్తి చేశారు.
Advertisement
Sonam Wangchuk
Delhi Police
Jantar Mantar Protest
Ladakh Sixth Schedule
Hunger Strike Delhi
Ram Manohar Lohia Hospital

More Telugu News