ఇరాన్‌పై అమెరికా ఉగ్రరూపం.. ఏడో రోజూ ఆగని బాంబుల వర్షం!

US fury on Iran Bombs continue for seventh day
  • ఇరాన్‌పై క్షిపణులు, బాంబులతో విరుచుపడిన అమెరికా
  • ఇరాన్‌ను నామరూపాల్లేకుండా చేయడమే లక్ష్యం
  • హర్మూజ్ జలసంధిలో హై అలర్ట్
  • అమెరికా బేస్‌లపై ఇరాన్ డ్రోన్ దాడులు
  • భూతల దాడులు కూడా చేస్తామని ట్రంప్ హెచ్చరిక
  • తాము కూడా సిద్ధంగా ఉన్నామన్న ఇరాన్
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముదిరాయి. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నామరూపాల్లేకుండా చేయడమే లక్ష్యంగా అమెరికా సైన్యం తన దాడులను తీవ్రతరం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇరాన్‌పై అమెరికా క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. వరుసగా ఏడో రాత్రి కూడా అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ఈ వైమానిక దాడులను విజయవంతంగా కొనసాగించింది. కేవలం గగనతలం నుంచే కాకుండా, ఇరాన్‌పై పటిష్టమైన నౌకాదళ దిగ్బంధనాన్ని విధిస్తూ అక్కడి సముద్ర తీరాల్లో అనుమానాస్పద నౌకలను అమెరికా దళాలు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి.

గ్రౌండ్ ఎటాక్‌కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్?
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదాన్ని మరింత పెంచేలా సంచలన హెచ్చరికలు చేశారు. ఇరాన్ మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని, అవసరమైతే ఇరాన్ తీర ప్రాంతాలు లేదా అక్కడి దీవులపై నేరుగా భూతల సైన్యంతో విరుచుకుపడతామని హెచ్చరించారు. ఈ మేరకు వైట్ హౌస్ సిట్యువేషన్ రూమ్‌లో కీలక సైనిక అధికారులతో ట్రంప్ వరుస సమీక్షలు నిర్వహించారు. ఇరాన్‌పై మరిన్ని దాడుల కోసం ఇజ్రాయెల్‌కు డజన్ల కొద్దీ ఏరియల్ రీఫ్యూయలింగ్ (ఆకాశంలోనే ఇంధనం నింపే) యుద్ధ విమానాలను పంపేందుకు వాషింగ్టన్ సిద్ధమవుతోంది.

యుద్ధానికి మేం కూడా సిద్ధం: ఇరాన్ హెచ్చరిక
అమెరికా దాడులపై ఇరాన్ సైన్యం కూడా అంతే తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు మొహసిన్ రెజాయ్ స్పందిస్తూ.. "అమెరికా దాడులు ఇలాగే మరో రెండు రోజులు కొనసాగితే, మేము పూర్తి స్థాయి ఎదురుదాడి ప్రారంభించి యుద్ధ రంగాన్ని మారుస్తాం" అని స్పష్టం చేశారు. అమెరికాకు సహకరిస్తున్న అరబ్ దేశాలలోని ప్రైవేట్ సంస్థలను సైతం టార్గెట్ చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

ప్రతిదాడి మొదలుపెట్టిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్
కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) బహ్రెయిన్‌లోని అమెరికాకు చెందిన నిఘా డ్రోన్ల కేంద్రాన్ని డ్రోన్లతో ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. అలాగే బహ్రెయిన్‌లోని ప్రధాన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్‌పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించామని, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా భీకర దాడులు చేశామని ఇరాన్ స్టేట్ మీడియా పేర్కొంది. కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న థాయ్‌లాండ్ పడవపై కూడా ఇరాన్ నావికాదళం దాడి చేసినట్లు తెలుస్తోంది.

గత వారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఒక్కసారిగా కుప్పకూలడంతో వాషింగ్టన్ - టెహ్రాన్ మధ్య మొదలైన ఈ సవాల్-ప్రతిసవాళ్లు ఇప్పుడు ప్రపంచ దేశాలను వణకిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల వల్ల హర్మూజ్ జలసంధి, ఎర్ర సముద్రం గుండా జరిగే అంతర్జాతీయ చమురు, ఇంధన సరఫరాకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
United States
Iran
Donald Trump
Middle East War
IRGC
Strait of Hormuz

More Telugu News