హైదరాబాద్‌ను చూసిన ప్రతిసారి అసూయ కలుగుతుంది... అదే నాలో కసిని పెంచింది: మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్

Nara Lokesh says seeing Hyderabad makes him jealous and increases his determination
  • మంగళగిరిలో రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ ప్రసంగం
  • 91 వేల మెజారిటీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని భావోద్వేగ ప్రసంగం
  • డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ
  • అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తామని, పెట్టుబడులు ఆకర్షిస్తామని హామీ
"హైదరాబాద్‌ను చూసిన ప్రతిసారీ నాకు అసూయ కలుగుతుంది. అక్కడి విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, ఐటీ టవర్లు చూసినప్పుడు కలిగే ఆ అసూయే.. నాలో కసిని పెంచింది. ఆంధ్రప్రదేశ్‌ను దక్షిణ భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దగలమన్న నమ్మకాన్ని ఇచ్చింది" అని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ శక్తిమంతమైన ప్రసంగం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్ విధానంలో ప్రారంభించిన ఆధునిక హంగులతో కూడిన మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ సభలో లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తన ప్రసంగంలో అభివృద్ధి, రాజకీయాలు, వ్యక్తిగత ప్రస్థానాన్ని కలగలిపి, ప్రజల్లో నూతనోత్సాహం నింపారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని లోకేశ్ కొనియాడారు. "ఒకప్పుడు రైళ్లు సమయానికి వచ్చేవి కావు, బోగీలు శుభ్రంగా ఉండేవి కావు. కానీ నేడు వందే భారత్, బుల్లెట్ రైళ్లు, కవచ్ భద్రతా టెక్నాలజీ, 100 శాతం విద్యుదీకరణతో రైల్వే రంగం స్వరూపమే మారిపోయింది. దేశాభివృద్ధికి రైల్వేలే కీలకమని ప్రధాని మోదీ బలంగా విశ్వసిస్తున్నారు" అని ఆయన పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా మంగళగిరిలో మరిన్ని రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను సభాముఖంగా కోరారు.

అమరావతి అభివృద్ధిపై లోకేశ్ తన దార్శనికతను స్పష్టం చేశారు. "రాజధాని అమరావతికి రోడ్డు, రైలు, వాయు మార్గాల అనుసంధానం అత్యంత కీలకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మూడింటినీ అనుసంధానిస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను రూపొందిస్తున్నారు. 2019-24 మధ్య ఆగిపోయిన అమరావతి పనులను ఇప్పుడు చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు పరుగులు పెట్టిస్తున్నారు. అమరావతిని ఒక గ్లోబల్ సిటీగా మార్చడమే మా అందరి లక్ష్యం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ఉన్న 'డబుల్ ఇంజన్ సర్కార్'తోనే ఇది సాధ్యమని ఆయన అన్నారు. దశాబ్దాల కల అయిన విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను ప్రధాని మోదీ ఆచరణలోకి తెచ్చారని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా మంగళగిరితో తనకున్న అనుబంధాన్ని, రాజకీయ ప్రయాణాన్ని లోకేశ్ భావోద్వేగంగా పంచుకున్నారు. "2019లో 5,300 ఓట్లతో ఓడిపోయినప్పుడు కుంగిపోలేదు. ఐదేళ్లు మీ మధ్యనే ఉన్నా, చెమటోడ్చి కష్టపడ్డా, మీ మనసు గెలుచుకున్నా. నేను ఏ మెజారిటీతో అయితే ఓడిపోయానో, దాని పక్కన ఒక సున్నా పెట్టి గెలిపించాలని కోరాను. మీరు నా మాట నిలబెట్టారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే టాప్-3 మెజారిటీతో, 91 వేల ఓట్ల ఆధిక్యంతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. ఈ గెలుపు నాకు కొండంత బలాన్నిచ్చింది, నాపై బాధ్యతను పెంచింది" అని అన్నారు. ఈ మెజారిటీని చూపించే కేంద్ర, రాష్ట్ర మంత్రులపై ఒత్తిడి తెచ్చి నియోజకవర్గానికి పనులు చేయిస్తున్నానని తెలిపారు.

ఎమ్మెల్యే, ఎంపీ కలిసి పనిచేస్తే ఒక ప్రాంతం ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుందో చెప్పడానికి మంగళగిరి ఒక ఉదాహరణ అని లోకేశ్ అన్నారు. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి పనిచేస్తూ లక్ష్మీ నరసింహ స్వామి గుడి అభివృద్ధికి, భూగర్భ డ్రైనేజీ వంటి పనులకు కేంద్రం నుంచి నిధులు సాధిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా, సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళుతున్నామని తెలిపారు. 

రాయల్ ఎన్‌ఫీల్డ్, గూగుల్, అదానీ అంకా వంటి పెద్ద కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయని, రాబోయే మూడేళ్లలో యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తనను గెలిపించిన ప్రజల కోసం అహర్నిశలు కష్టపడతానని, వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ లోకేష్ తన ప్రసంగాన్ని ముగించారు.


Advertisement
Nara Lokesh
Mangalagiri Railway Station
Andhra Pradesh Development
Amaravati Global City
Narendra Modi
South Coast Railway Zone

More Telugu News