13 రోజుల నుంచి 16 ఏళ్ల వరకు.. దేశాన్ని కదిలించిన నిరాహార దీక్షలు ఇవే!

Anna Hazare and Mahatma Gandhi historic fasting protests in India
  • వాంగ్‌చుక్‌ దీక్షతో మళ్లీ చర్చలోకి నిరాహార దీక్షలు
  • 16 ఏళ్ల పాటు ఇరోమ్‌ షర్మిలా నిరసన
  • 116 రోజుల పాటు జైలులో భగత్‌ సింగ్‌ దీక్ష
  • 58 రోజుల పొట్టి శ్రీరాములు ఉద్యమం
  • 21 రోజుల గాంధీ ఆత్మశుద్ధి దీక్ష
  • 13 రోజుల అన్నా హజారే పోరాటం
భారత్‌లో నిరాహార దీక్షలు కేవలం నిరసనకే పరిమితం కాలేదు. ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వాలను నిర్ణయాలు మార్చేకునేలా చేశాయి. కొన్ని ఉద్యమాలు కొత్త చట్టాలకు దారి తీశాయి. మరికొన్ని రాష్ట్రాల ఏర్పాటుకు కారణమయ్యాయి. ప్రస్తుతం సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిరాహార దీక్ష ఈ పోరాటాల చరిత్రను గుర్తు చేస్తోంది. దేశంపై ప్రభావం చూపిన ఐదు కీలక నిరాహార దీక్షలు ఇవే.

ఇరోమ్‌ షర్మిలా
మణిపూర్‌లో అమల్లో ఉన్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇరోమ్‌ షర్మిలా 2000 నవంబర్‌ 4న నిరాహార దీక్ష ప్రారంభించారు. 16 ఏళ్ల పాటు కొనసాగిన ఈ దీక్షను ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ నిరాహార దీక్షగా గుర్తిస్తారు. న్యాయపరమైన నిర్బంధంలో ఉండగా ముక్కు ద్వారా ఆహారం అందించారు. చివరకు 2016 ఆగస్టు 9న తేనె రుచి చూసి ఆమె దీక్ష విరమించారు.

భగత్‌సింగ్‌
లాహోర్‌ జైలులో బ్రిటిష్‌ పాలకుల వివక్షను నిరసిస్తూ భగత్‌సింగ్‌, బటుకేశ్వర్‌ దత్‌, జతీంద్రనాథ్‌ దాస్‌ 1929లో 116 రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. దీక్ష సమయంలో జతీంద్రనాథ్‌ దాస్‌ మరణించడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఆ తర్వాత జైళ్లలో పలు సంస్కరణలు అమల్లోకి వచ్చాయి.

పొట్టి శ్రీరాములు
తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ 1952 అక్టోబర్‌ 19న పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 58 రోజుల దీక్ష అనంతరం డిసెంబర్‌ 15న ఆయన మరణించారు. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. చివరకు 1953 అక్టోబర్‌ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.

మహాత్మా గాంధీ

దళితుల అభ్యున్నతి, అంటరానితనం నిర్మూలన లక్ష్యంగా మహాత్మా గాంధీ 21 రోజుల నిరాహార దీక్ష చేశారు. దీన్ని రాజకీయ నిరసనగా కాకుండా ఆత్మశుద్ధి కోసం చేపట్టిన ఆధ్యాత్మిక దీక్షగా అభివర్ణించారు. దేవాలయాలు, బావులు, పాఠశాలలు అందరికీ అందుబాటులో ఉండాలన్న సందేశాన్ని ఇచ్చారు.

అన్నా హజారే
2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే 13 రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. బలమైన లోక్‌పాల్‌ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు లభించడంతో పార్లమెంట్‌ ఆయన ప్రధాన డిమాండ్లను సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆ తర్వాతే ఆయన దీక్ష విరమించారు.







Advertisement
Hunger Strikes in India
Anna Hazare Lokpal
Potti Sriramulu Andhra State
Irom Sharmila AFSPA
Bhagat Singh Prison Reform
Mahatma Gandhi Fasting

More Telugu News