తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో సాయిపల్లవికి ఎంతో క్రేజ్ ఉంది. సాయిపల్లవి ఒక కథకు ఓకే చెప్పిందంటే, ఆ కథలో ఏదో బలమైన పాయింట్ ఉండి ఉంటుందని అభిమానులు భావిస్తూ ఉంటారు. అలాంటి సాయిపల్లవి తొలిసారిగా ఒక హిందీ సినిమా చేసింది. ఆ సినిమా పేరే 'ఏక్ దిన్'. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, మే 1వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను 'అమెజాన్ ప్రైమ్' దక్కించుకుంది. ఈ రోజు (జులై 17) నుంచి ఈ సినిమా హిందీతో పాటు ఇతర భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
దినేష్ (జునైద్ ఖాన్) ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. అదే ఆఫీసులో మీరా రంగనాథ్ (సాయిపల్లవి) వర్క్ చేస్తూ ఉంటుంది. ఆమెను చూడగానే అతను మనసు పారేసుకుంటాడు. అయితే ఆమె ఆ సంస్థకి చెందిన 'నకుల్' (కునాల్ కపూర్)తో చనువుగా ఉండటం చూసి చాలా ఆవేదన చెందుతూ ఉంటాడు. నకుల్ తన భార్య 'రీతూ' (జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్)తో విడాకులు తీసుకోనున్నట్టు మీరాతో చెబుతాడు. మీరా పట్ల తనకి గల ప్రేమను వ్యక్తం చేస్తాడు.
మీరాకి 'జపాన్'ను చూడాలనే కోరిక చిన్నప్పటి నుంచి బలంగా ఉంటుంది. ఆ విషయం నకుల్ కి తెలుసు. ఆ ఏడాది తాము టార్గెట్ రీచ్ అయ్యామంటూ, అతను ఎంప్లాయిస్ ను జపాన్ తీసుకుని వెళతాడు. అక్కడ నకుల్ తో మీరా మరింత సాన్నిహిత్యంగా ఉండటం చూసి, దినేష్ బాధపడతాడు. అయితే అనుకోకుండా అక్కడికి నకుల్ భార్య 'రీతూ' వస్తుంది. ఆమె గర్భవతి అని మీరాకి తెలుస్తుంది. రీతూకి విడాకులు ఇవ్వనున్నట్టు తనకి నకుల్ చెప్పింది అబద్ధమని గ్రహిస్తుంది.
తనని నకుల్ మోసం చేయడాన్ని తట్టుకోలేని మీరా, విపరీతంగా తాగేసి ప్రమాదానికి గురవుతుంది. ఆమెను హాస్పిటల్లో చేరుస్తాడు దినేష్. ఆమె తన గతాన్ని మరిచిపోయిందనీ, 24 గంటల తరువాత గతం గుర్తుకు వస్తుందని డాక్టర్లు చెబుతారు. అయితే గతం గుర్తుకు వచ్చిన తరువాత, ఈ 24 గంటలలో ఏం జరిగిందనేది ఆమెకి ఎంతమాత్రం గుర్తుకురాదని అంటారు. అప్పుడు దినేష్ ఏం చేస్తాడు? ఒక్కరోజుపాటు తనతో మీరా ప్రేమగా ఉన్నా చాలనుకున్న అతని కోరిక నెరవేరుతుందా? ఆ రోజు తరువాత, దినేష్ తో గడిపిన క్షణాలు ఆమెకి గుర్తుంటాయా? అనేది మిగతా కథ.
శ్రీమంతుడైన ఒక యువకుడు తన ఆఫీసులో పనిచేసే 'మీరా'పై కన్నేస్తాడు. తన భార్య మంచిది కాదంటూ, మీరాకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. జపాన్ చూడాలనే ఆమెలోని కోరికను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. మిగతా ఎంప్లాయిస్ తో పాటు అక్కడికి తీసుకుని వెళతాడు. ఆమెను సొంతం చేసుకోవడానికి రంగాన్ని సిద్ధం చేస్తాడు. అతని నిజస్వరూపం తెలుసుకున్న మీరా ప్రమాదానికి గురవుతుంది. ఆమెను మౌనంగా ఆరాధిస్తూ .. అనుసరిస్తూ వస్తున్న దినేష్ ఏం చేస్తాడు? అనే అంశం చుట్టూ నడిచే కథ ఇది.
ఈ కథ అంతా మీరా .. నకుల్ .. దినేష్ చుట్టూ తిరుగుతుంది. ప్రేమ పేరుతో ఆకర్షించే నకుల్, ప్రేమ అనుకుని ఆకర్షణ దిశగా పరిగెత్తే మీరా, ఆమె ప్రేమ కోసం ఎంతకాలమైనా ఎదురు చూడొచ్చునని భావించే దినేష్ పాత్రలు ఈ కథలో ప్రధానమైనవి. కథను మొదటి నుంచి చివరి వరకూ నడిపించేంత కీలకమైనవి. తెరపై ఎక్కువగా ఈ మూడు పాత్రలు మాత్రమే కనిపించినా, ఎక్కడా బోర్ అనిపించదు. ప్రతి సన్నివేశంలోని ఫీల్ కనెక్ట్ అవుతుంది.
జీవితంలో ఎవరు ఎలాంటి వాళ్లు అనేది తెలియాలంటే అవసరమో .. ఆపదో రావాలంటారు. అప్పుడే మనతో నిలబడేదెవరో .. మనలను నిలబెట్టేదెవరో అర్థమైపోతుంది. సరిగ్గా ఆ పాయింట్ ను టచ్ చేస్తూనే దర్శకుడు ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లాడు. నిజమైన ప్రేమను పంచే మనసును .. వాళ్ల పలకరింపును .. స్పర్శను మరిచిపోవడం అసాధ్యమనే విషయాన్ని దర్శకుడు ఆవిష్కరించిన విధానం గొప్పగా అనిపిస్తుంది.
సాయిపల్లవి నటన ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఆడంబరాలు .. ఆకర్షణలు కాదు, ప్రేమించడానికి మంచి మనసు ఉండాలని నిరూపించే పాత్రలో జునైద్ కూడా నీట్ గా చేశాడు. అవసరం .. అవకాశం తప్ప మనిషికీ .. మనిషికి మధ్య మరేమీ ఉండదనే పాత్రలో కునాల్ నటన కూడా ఆకట్టుకుంటుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ .. లొకేషన్స్ ఈ కథను మరింత సపోర్టు చేస్తూ సాగుతాయి.
జీవితంలో మనలను ప్రేమించే మనిషంటూ ఒకరి ఉంటే, ఆ ప్రయాణం ఎంతో అందంగా .. అనుభూతి మయంగా ఉంటుంది. అలాంటి ప్రేమను అర్థం చేసుకోలేకపోతే ఆ వెలితి వెంటాడుతూ ఉంటుంది. నిజమైన ప్రేమ .. నిస్వార్థమైన ప్రేమ ఓడిపోయిన దాఖలాలు దాదాపుగా లేవని నిరూపించే ఈ కథ, ఫ్యామిలీ ఆడియన్స్ కి తప్పకుండా కనెక్ట్ అవుతుంది.
'ఏక్ దిన్'( అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Ek Din Review
Movie Details
Movie Name: Ek Din
Release Date: 2026-07-17
Cast: Sai Pallavi,Junaid Khan ,Kunal Kapoor,Kavin Dave
Director: Sunil Pandey
Music: Ram Sampath
Banner: Aamir Khan Productions
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer