జగన్ పాలనలో అదే పట్టిసీమ దిక్కయింది: దేవినేని ఉమా
- పట్టిసీమను జగన్ వట్టిసీమ అన్నారన్న దేవినేని ఉమా
- జగన్ అధికారంలోకి వచ్చాక అదే పట్టిసీమ ద్వారా నీరు ఇవ్వాల్సి వచ్చిందని ఎద్దేవా
- పులివెందులకు కూడా చంద్రబాబు నీరు ఇచ్చారని వ్యాఖ్య
గంగా-కావేరి నదుల అనుసంధానంపై డాక్టర్ కేఎల్ రావు కలగన్నారని... ఆ స్ఫూర్తితోనే సీఎం చంద్రబాబు గోదావరి-కృష్ణ నదుల అనుసంధానాన్ని పట్టిసీమ ద్వారా సాకారం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. గతంలో జగన్ పట్టిసీమను 'వట్టిసీమ' అని విమర్శించారని... ఆయన పాలనలో అదే పట్టిసీమ ద్వారా నీటిని ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యంగ్యంగా అన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పారు.
పట్టిసీమ, అమరావతి నిర్మాణాల్లో జగన్ అడ్డంకులు సృష్టించి రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు అకుంఠిత దీక్షతో మార్చి 2025లో పట్టిసీమ పనులు ప్రారంభించి, సెప్టెంబర్‌లోనే తొలి విడతగా కొంత నీటిని డెల్టాకు నీరందించారని తెలిపారు. పులివెందులకు కూడా చంద్రబాబు నీరు ఇచ్చారని అన్నారు.
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీరు అందడం వల్ల చౌడు భూములు సారవంతంగా మారి, ఎకరాకు దిగుబడి 50 నుంచి 60 బస్తాలకు పెరిగిందన్నారు. సాగు నీరు సమృద్ధిగా అందడం వల్ల ఎరువుల ఖర్చు తగ్గి రైతుల ఆదాయం పెరిగిందని, రాయలసీమ నేడు హార్టికల్చర్ రంగంలో అద్భుతాలు చేస్తోందని ఉమా వివరించారు.