అంతరిక్షంలోకి మోదీ చేతిరాత.. విక్రమ్-1 మిషన్‌లో ‘వందేమాతర’ సందేశం

Narendra Modi handwritten postcard to travel in Skyroot Aerospace Vikram-1 rocket
  • విక్రమ్-1తో మోదీ పోస్టుకార్డు ప్రయాణం
  • ‘వందేమాతరం’ మోదీ చేతిరాత సందేశం
  • జులై 18న విక్రమ్-1 ప్రయోగం
  • తొలి ప్రైవేటు ఆర్బిటల్‌ రాకెట్‌
  • ‘మిషన్‌ ఆగమన్‌’లో ప్రత్యేక జ్ఞాపికలు
  • శ్రీహరికోట నుంచి ప్రయోగం
భారత అంతరిక్ష ప్రయాణంలో మరో భావోద్వేగ క్షణం చోటు చేసుకోనుంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చేతితో రాసిన ‘వందేమాతరం’ సందేశం ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లబోతోంది. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేటు స్పేస్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ రూపొందించిన విక్రమ్-1 టెస్ట్‌ ఫ్లైట్‌-1 మిషన్‌తో ఈ ప్రత్యేక పోస్టుకార్డు ప్రయాణించనుంది. రేపు ఈ ప్రయోగం జరగనుంది.

స్కైరూట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మోదీ రాసిన పోస్టుకార్డుతో పాటు సంస్థ ఉద్యోగులు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషులు చేతితో రాసిన సందేశాలను కూడా రాకెట్‌లో పంపనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ‘మిషన్‌ ఆగమన్‌’ అని పేరు పెట్టారు. భారత ప్రైవేటు అంతరిక్ష రంగానికి లభిస్తున్న మద్దతుకు ఇవి ప్రతీకగా నిలుస్తాయని సంస్థ వెల్లడించింది.

స్కైరూట్‌ ఏరోస్పేస్‌ రూపొందించిన తొలి ఆర్బిటల్‌ లాంచ్‌ వెహికల్‌ విక్రమ్‌-1. దీని ద్వారా స్వదేశీ సాంకేతిక సామర్థ్యాన్ని నిరూపించడంతో పాటు వాణిజ్య అంతరిక్ష రంగంలో భారత్‌కు మరింత గుర్తింపు తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. భారత భూభాగం నుంచి వెళ్లనున్న తొలి ప్రైవేటు ఆర్బిటల్‌ రాకెట్‌గా కూడా ఇది చరిత్ర సృష్టించనుంది.

ఈ రాకెట్‌లో జ్ఞాపికలతో పాటు పలు సాంకేతిక ప్రదర్శన పేలోడ్‌లను కూడా పంపుతున్నారు. గ్రాహా స్పేస్‌, కాస్మోసర్వ్‌, డీక్యూబ్డ్‌, స్కైరూట్‌ రూపొందించిన స్కోప్‌ పేలోడ్‌లు ఇందులో ఉన్నాయి. అలాగే కాస్మిక్‌ బ్లూమ్‌ పేరుతో రూపొందించిన కళాఖండం, మైక్రో ఆర్ట్‌ పేలోడ్‌ను కూడా అంతరిక్షంలోకి తీసుకెళుతున్నారు.

జులై 18న శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం తొలి ప్రయోగ వేదిక నుంచి విక్రమ్‌-1 ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి అవసరమైన గగనతల, సముద్ర అనుమతులు ఇప్పటికే లభించినట్లు స్కైరూట్‌ వెల్లడించింది.
Advertisement
Narendra Modi
Skyroot Aerospace
Vikram-1 Mission
Vande Mataram message
Sriharikota space launch
Private orbital rocket India

More Telugu News