భారత్‌పై ఫిర్యాదు.. ఖర్చు మొత్తం భరిస్తున్న పాక్‌.. సింధు జలాల వివాదంలో ట్విస్ట్‌

Pakistan pays full cost of Indus Waters dispute after complaint against India
  • సింధు జలాల వివాదంపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సంస్థను ఆశ్రయించిన పాక్‌
  • విచారణను బహిష్కరించిన భారత్‌
  • భారత ఖర్చులనూ చెల్లిస్తున్న పాక్‌
  • ఇప్పటి వరకు రూ.5.2 కోట్లకు పైగా ఖర్చు
  • మున్ముందు మరింత పెరగనున్న భారం
భారత్‌పై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సంస్థను ఆశ్రయించిన పాకిస్థాన్‌కు ఇప్పుడు అదే కేసు భారంగా మారింది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన వివాదంలో భారత్‌ విచారణను బహిష్కరించడంతో, మధ్యవర్తిత్వ ప్రక్రియ ఆగిపోకుండా ఉండేందుకు పాకిస్థానే రెండు దేశాల ఖర్చును భరిస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రక్రియ కోసం ఆరు లక్షల డాలర్లకు పైగా అంటే సుమారు రూ.5.2 కోట్లకు పైగా వెచ్చించినట్లు నివేదికలు వెల్లడించాయి. విచారణ కొనసాగుతున్న కొద్దీ ఈ భారం మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి.

సింధు జలాల ఒప్పందం ప్రకారం వివాదాలు తలెత్తితే మధ్యవర్తిత్వ వ్యయాన్ని భారత్‌, పాకిస్థాన్‌ సమానంగా భరించాలి. అయితే 2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ పూర్తిగా చెక్‌ పెట్టే వరకు సింధు జలాల ఒప్పంద అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో ఈ వివాదానికి సంబంధించిన మధ్యవర్తిత్వ ప్రక్రియ నుంచి కూడా తప్పుకొంది.

కిషన్‌గంగా, రాట్లే జలవిద్యుత్‌ ప్రాజెక్టులపై పాకిస్థాన్‌ పర్మినెంట్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టుల రూపకల్పన ఒప్పందానికి విరుద్ధమని ఇస్లామాబాద్‌ వాదిస్తోంది. కానీ ఇది సాంకేతిక అంశమని, ఇలాంటి వివాదాలను కోర్టు కాకుండా తటస్థ నిపుణుడే పరిశీలించాలని భారత్‌ మొదటి నుంచీ చెబుతోంది. రెండు వ్యవస్థలు ఒకేసారి నడవడం ఒప్పంద నిబంధనలకు విరుద్ధమని కూడా స్పష్టం చేసింది.

అంతర్జాతీయ మధ్యవర్తిత్వ నిబంధనల ప్రకారం ఒక పక్షం హాజరు కాకపోయినా ట్రైబ్యునల్‌కు అధికార పరిధి ఉందని భావిస్తే విచారణ కొనసాగించవచ్చు. అదే కారణంతో ‘పర్మినెంట్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌’ పాకిస్థాన్‌ పిటిషన్‌పై విచారణ కొనసాగిస్తోంది. అయితే ఈ ట్రైబ్యునల్‌ చట్టబద్ధంగా ఏర్పడలేదని భారత్‌ చెబుతోంది. అందువల్ల ఆ కోర్టు ఇచ్చే ఎలాంటి తీర్పునూ తాము గుర్తించబోమని ఇప్పటికే స్పష్టం చేసింది.

భారత్‌ విచారణకు హాజరు కాకపోయినా కేసును కొనసాగించాలంటే మొత్తం ఖర్చును పాకిస్థానే భరించాల్సి వస్తోంది. అందుకే తన వాటాతో పాటు భారత్‌ చెల్లించాల్సిన మొత్తాన్నీ ఇస్లామాబాద్‌ చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.5.2 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. విచారణ ఇంకా కొనసాగితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే పాకిస్థాన్‌ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) నుంచి 7 బిలియన్‌ డాలర్ల సహాయ ప్యాకేజీపై ఆధారపడుతోంది. పన్నుల పెంపు, సబ్సిడీల కోత, అప్పుల నియంత్రణ వంటి కఠిన షరతుల మధ్య ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సమయంలో మధ్యవర్తిత్వ ఖర్చు కూడా పెరగడం పాకిస్థాన్‌పై అదనపు భారంగా మారింది.
Advertisement
Pakistan
Indus Waters Treaty
India Pakistan water dispute
Permanent Court of Arbitration
Kishanganga Ratle projects
Arbitration costs

More Telugu News