గూగుల్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఒక్క రోజులో రూ.17 లక్షల కోట్లకు పైగా ఆవిరి!

Google Parent Alphabet Market Value Drops 200 Billion Dollars Due To AI Delay
  • ‘జెమినీ 3.5 ప్రో’ మోడల్‌ విడుదలకు మరికొన్ని నెలలు
  • ఈ వార్తలతో పెట్టుబడిదారుల్లో ఒక్కసారిగా ఆందోళన
  • గురువారం ట్రేడింగ్‌లో ఆల్ఫాబెట్‌ షేరు 4.4 శాతం పతనం
  • ‘జెమినీ 3.5 ప్రో’ కోడింగ్‌ సామర్థ్యంతోనే గూగుల్‌కు సవాల్‌
  • గూగుల్‌ నుంచి నిపుణులు వైదొలగడమూ ఓ కారణం
గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) విభాగంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘జెమినీ 3.5 ప్రో’ మోడల్‌ విడుదల మరికొన్ని నెలలు ఆలస్యమవనుంది. ఈ వార్తలతో పెట్టుబడిదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఫలితంగా గురువారం ట్రేడింగ్‌లో ఆల్ఫాబెట్‌ షేరు 4.4 శాతం పడిపోయింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువలో సుమారు రూ.17 లక్షల కోట్లకు పైగా (200 బిలియన్‌ డాలర్లు) ఆవిరైనట్లు అంచనా. ఈ పరిణామం టెక్నాలజీ రంగంపైనా ప్రభావం చూపింది. 

జెమినీ 3.5 ప్రో అభివృద్ధి పనులపై అవగాహన ఉన్న వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మోడల్‌ పురోగతి సంస్థ నిర్ణయించుకున్న షెడ్యూల్‌ కంటే చాలా వెనుకబడి ఉంది. ముఖ్యంగా కోడింగ్‌ సామర్థ్యమే గూగుల్‌కు పెద్ద సవాల్‌గా మారింది. జూన్‌ చివర్లో మోడల్‌కు కొత్త ట్రైనింగ్‌ డేటా జోడించి కోడింగ్‌ పనితీరు మెరుగుపరచాలని ప్రయత్నించినా ఆశించిన ఫలితం రాలేదని సమాచారం. దీంతో ఇంజినీర్లు ఇంకా పనితీరును మెరుగుపరిచే పనిలోనే ఉన్నారని తెలుస్తోంది. 

గూగుల్‌ మే నెలలో జరిగిన ఐ/ఓ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో జెమినీ 3.5 ప్రోను వచ్చే నెలలో విడుదల చేస్తామని ప్రకటించింది. తర్వాత జూన్‌లో కూడా సీఈవో సుందర్‌ పిచాయ్‌ అదే హామీ ఇచ్చారు. అయితే జులై మధ్య నాటికీ ఈ మోడల్‌ విడుదలకు సిద్ధం కాలేదు.

ఈలోగా కోడింగ్‌ సామర్థ్యం ఎక్కువగా ఉన్న కొత్త ఏఐ మోడళ్లను ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌, మెటా మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి. చైనాకు చెందిన డీప్‌సీక్‌, జెడ్‌.ఏఐ, మూన్‌షాట్‌ వంటి సంస్థలు తక్కువ ధరలో ఓపెన్‌ వెయిట్‌ మోడళ్లను అందుబాటులోకి తెచ్చాయి. దీంతో ఏఐ మార్కెట్‌లో పోటీ మరింత తీవ్రమైంది. మరోవైపు జూన్‌లో కేవలం ఎనిమిది రోజుల్లోనే గూగుల్‌ నుంచి ఐదుగురు కీలక ఏఐ నిపుణులు వైదొలగడం కూడా సంస్థకు ఇబ్బందిగా మారింది. వారిలో నలుగురు ప్రత్యర్థి సంస్థ ఆంథ్రోపిక్‌లో చేరడం గమనార్హం.  

అయితే ఈ పరిణామం గూగుల్‌ ఏఐ పోటీలో వెనుకబడిపోయిందనే అర్థం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. సంస్థకు మౌలిక సదుపాయాలు, క్లౌడ్‌ వ్యాపారం, ఏఐ వినియోగం బలంగానే ఉన్నాయని పేర్కొంటున్నారు. కానీ అత్యాధునిక ఏఐ మోడళ్ల విషయంలో ఇచ్చిన హామీలను సమయానికి నిలబెట్టుకోవడమే ఇప్పుడు గూగుల్‌కు అసలు పరీక్షగా మారిందని అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 22న ప్రకటించనున్న రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా సుందర్‌ పిచాయ్‌ జెమినీ 3.5 ప్రో విడుదలపై స్పష్టత ఇస్తారా లేదా అన్నదే ఇప్పుడు ఇన్వెస్టర్ల దృష్టి మొత్తం కేంద్రీకృతమైంది.
Advertisement
Google
Alphabet Inc
Gemini 3-5 Pro
Sundar Pichai
Artificial Intelligence
Stock Market Loss

More Telugu News