ఏపీలో ఈ నెల 22న 'తల్లికి వందనం' నిధులు విడుదల... మార్గదర్శకాలు ఇవే!

Thalliki Vandanam funds to be credited on September 8 in Andhra Pradesh
  • తల్లికి వందనం’ పథకానికి రూ.10,120.78 కోట్లు మంజూరు
  • 42.70 లక్షల మంది తల్లులు, 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
  • సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి బిడ్డకు రూ.15,000 ఆర్థిక సాయం
  • పాఠశాల నిర్వహణ కోసం రూ.2,000 మినహాయింపు, తల్లి ఖాతాలో రూ.13,000 జమ
  • 2026-27 విద్యా సంవత్సరానికి పథకం అమలుకు ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఈ పథకం అమలు, మార్గదర్శకాల కోసం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గురువారం జీవో నెం.15, జీవో నెం.16 జారీ చేశారు. ఈ పథకం కోసం రూ.10,120.78 కోట్లు మంజూరు చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 42,70,802 మంది తల్లులకు, వారి 67,47,190 మంది పిల్లలకు లబ్ధి చేకూరనుంది. జులై 22వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నారు. విద్యార్థుల్లో డ్రాపౌట్లను తగ్గించి, వారి చదువులో తల్లుల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తోంది.

గత విద్యా సంవత్సరం (2025-26) నుంచి అమలవుతున్న ఈ పథకం కింద, 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలను బడికి పంపుతున్న ప్రతి తల్లికి, వారి పిల్లల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఒక్కో బిడ్డకు ఏటా రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.

నిధుల కేటాయింపు, చెల్లింపు విధానం

ప్రతి విద్యార్థికి అందించే రూ.15,000 ఆర్థిక సహాయం నుంచి రూ.2,000 పాఠశాలలు, జూనియర్ కళాశాలల నిర్వహణ, పారిశుధ్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం మినహాయిస్తారు. మిగిలిన రూ.13,000 నేరుగా అర్హులైన తల్లుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, తల్లులను ఆర్థికంగా ప్రోత్సహించడం కూడా ప్రభుత్వ ఉద్దేశం.

పథకానికి అర్హతలు ఇవే:

'తల్లికి వందనం' పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం స్పష్టమైన అర్హత నిబంధనలను నిర్దేశించింది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు (SGSW) శాఖ ఆరు దశల ధ్రువీకరణ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది.

ఆదాయం: గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలసరి ఆదాయం రూ.10,000, పట్టణ ప్రాంతాల్లో రూ.12,000 మించకూడదు.
భూమి: మాగాణి అయితే 3 ఎకరాల లోపు, మెట్టభూమి అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. రెండూ కలిపి ఉన్నా 10 ఎకరాల పరిమితికి లోబడే ఉండాలి.
వాహనం: కుటుంబంలో ఎవరి పేరు మీదా నాలుగు చక్రాల వాహనం ఉండరాదు. అయితే, టాక్సీ, ట్రాక్టర్, ఆటోలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.
విద్యుత్ వినియోగం: కుటుంబం నెలసరి విద్యుత్ వినియోగం సగటున 300 యూనిట్లకు మించరాదు. దీని కోసం గత 12 నెలల సగటును పరిగణనలోకి తీసుకుంటారు.
ఆస్తి: పట్టణ ప్రాంతాల్లో నివసించే కుటుంబానికి 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో మున్సిపల్ ఆస్తి ఉండకూడదు.
ప్రభుత్వ ఉద్యోగం: కుటుంబ సభ్యుల్లో ఎవరూ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా లేదా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగిగా ఉండరాదు. ప్రభుత్వ పింఛనుదారులకు కూడా ఇది వర్తించదు. పారిశుధ్య కార్మికులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, నిర్దేశిత ఆదాయ పరిమితి లోపు జీతం తీసుకునే వారికి మినహాయింపు ఉంటుంది.
ఆదాయ పన్ను: కుటుంబంలో ఏ ఒక్క సభ్యుడు కూడా ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా ఉండకూడదు.
చదువు: విద్యార్థులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాల/జూనియర్ కళాశాలలో చదువుతూ ఉండాలి. ఐటీఐ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ వంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే కోర్సులకు ఈ పథకం వర్తించదు.

ప్రత్యేక నిబంధనలు, చెల్లింపులు

అనాథలు: స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలల్లో చేరిన అనాథలు, వీధి బాలలు ఈ పథకానికి అర్హులే. సంబంధిత జిల్లా కలెక్టర్ వారి తరఫున గార్డియన్-ఆపరేటెడ్ బ్యాంకు ఖాతాను తెరిచి, నిధులు సక్రమంగా అందేలా పర్యవేక్షిస్తారు.
RTE విద్యార్థులు: విద్యా హక్కు చట్టం (RTE) కింద ప్రైవేట్ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల విషయంలో, ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును నేరుగా పాఠశాల యాజమాన్యానికి చెల్లిస్తారు. ఆ మొత్తం పోగా ఏమైనా మిగిలితే, దానిని తల్లి ఖాతాలో జమ చేస్తారు.
ఇతర స్కాలర్‌షిప్‌లు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు పొందుతున్నట్లయితే, ఆ పథకం కింద వచ్చే మొత్తాన్ని మినహాయించి, మిగిలిన బ్యాలెన్స్ మొత్తాన్ని 'తల్లికి వందనం' కింద చెల్లిస్తారు.

అమలు షెడ్యూల్, ఫిర్యాదుల పరిష్కారం

పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా విద్యార్థులు, వారి తల్లుల వివరాలను సేకరించి, SGSW విభాగం ధ్రువీకరిస్తుంది. జులై 22న అర్హులు, అనర్హుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను జమ చేయాలని ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. తప్పుడు సమాచారం ఇచ్చి లబ్ధి పొందినట్లు తేలితే, ఆ మొత్తాన్ని రికవరీ చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. పథకంపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే, SGSW కార్యాలయాల్లోని ఆన్‌లైన్ గ్రీవెన్స్ మెకానిజం ద్వారా పరిష్కరిస్తారు.
Advertisement
Thalliki Vandanam Scheme
Andhra Pradesh Government
School Education Department
Education Welfare Schemes
Thalliki Vandanam Eligibility
AP Government Cash Transfer

More Telugu News