ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి: గల్లా జయదేవ్‌ను ఉద్దేశించి మంత్రి నారా లోకేశ్ పోస్ట్

Andhra Pradesh should apologize to you Nara Lokesh apologizes to Galla Jayadev
  • తెలంగాణలో అమరరాజా సరికొత్త తయారీ కేంద్రం
  • వైసీపీ హయాంలో అమరరాజాను తీవ్రంగా వేధించారన్న లోకేశ్
  • ఏపీలో మళ్లీ కీలకపాత్ర పోషించాలని ఆకాంక్ష

తెలంగాణలో అమరరాజా గ్రూప్ సరికొత్త తయారీ కేంద్రాన్ని (గిగా ఫ్యాక్టరీ) ప్రారంభిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఆ సంస్థకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరరాజా సంస్థ ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. అమరరాజా అధినేత, మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌కు ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


జగన్ హయాంలో సొంత రాష్ట్రంలోనే ఎంతో ఆదరణ, ప్రోత్సాహం దక్కాల్సిన అమరరాజా వంటి దిగ్గజ సంస్థ తీవ్ర వేధింపులకు గురైందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వేధింపుల కారణంగానే ఆ సంస్థ ఏపీ వదిలి పక్క రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. "గత ప్రభుత్వ దుందుడుకు చర్యల వల్ల జరిగిన నష్టానికి గానూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీకు క్షమాపణ చెప్పాలి" అంటూ అమరరాజా సంస్థ అధినేత, మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌ను ఉద్దేశించి లోకేశ్ బహిరంగంగా క్షమాపణలు కోరారు.


ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారిందని లోకేశ్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో అమరరాజా గ్రూప్ చేపట్టబోయే విస్తరణ పనుల్లో ఆంధ్రప్రదేశ్ మళ్లీ కీలక పాత్ర పోషించాలని, ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆకాంక్షించారు.


లోకేశ్ సోషల్ మీడియా పోస్టు ఇలా...

"జయదేవ్ గల్లా, ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పి తీరాలి. గత నాలుగు దశాబ్దాలుగా అమరరాజా, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విజయగాథల్లో ఒకటిగా మాత్రమే నిలవలేదు. అది మన రాష్ట్రానికి అంతకుమించి ఎంతో చేసింది. ప్రపంచ స్థాయి తయారీ పరిశ్రమను సృష్టించింది, వేలాది మందికి ఉద్యోగాలు కల్పించింది, చిత్తూరు జిల్లా పేరును, ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టింది.

గత ప్రభుత్వ హయాంలో మీ సంస్థ ఎదుర్కొన్న వేధింపులు నిజంగా జరగకూడనివి. సొంత రాష్ట్రంలో పరిశ్రమ పెట్టి, అభివృద్ధి చేయాలనుకున్న ఒక పారిశ్రామికవేత్తకు ప్రోత్సాహం లభించాలి కానీ, బెదిరింపులు కాదు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన ఒక కంపెనీ, తన తదుపరి వృద్ధి కోసం మన రాష్ట్ర సరిహద్దులు దాటి చూడాల్సి రావడం నన్ను వ్యక్తిగతంగా ఎంతో బాధిస్తోంది.

మేము ప్రజల నమ్మకాన్ని తిరిగి నిలబెడుతున్న ఈ తరుణంలో, నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను: ఆంధ్రప్రదేశ్ మరోసారి పరిశ్రమలకు, వ్యాపారాలకు అనుకూలమైన రాష్ట్రంగా మారింది. అమరరాజా ప్రస్థానంలో అతిపెద్ద, అత్యంత విజయవంతమైన అధ్యాయాలు దాని ప్రయాణం ప్రారంభమైన ఈ రాష్ట్రంలోనే లిఖించబడతాయని నేను ఆశిస్తున్నాను. మా తలుపులు, మా హృదయాలు మీ కోసం ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి.

తెలంగాణలో మీరు ఏర్పాటు చేస్తున్న కొత్త పరిశ్రమకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని తన సోషల్ మీడియా పోస్టులో లోకేశ్ పేర్కొన్నారు.
Advertisement
Nara Lokesh
Galla Jayadev
Amara Raja Group
Andhra Pradesh Politics
Amara Raja Giga Factory
YS Jagan Mohan Reddy

More Telugu News