భారత పేసర్ గుర్నూర్ బ్రార్‌కు డీమెరిట్ పాయింట్.. ఐసీసీ సీరియస్ వార్నింగ్!

Gurnoor Brar gets demerit point and serious ICC warning
  • ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద ఒక డీమెరిట్ పాయింట్ నమోదు
  • ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో బ్యాటర్ వైపు బంతి విసిరిన ఘటన
  • తప్పును అంగీకరించడంతో విచారణ లేకుండానే శిక్ష ఖరారు
  • రెండేళ్ల కాలంలో గుర్నూర్‌కు ఇదే తొలి తప్పిదం
భారత యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ సింగ్ బ్రార్‌పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడికి అధికారికంగా హెచ్చరిక జారీ చేయడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను రికార్డుల్లో నమోదు చేసింది. ఈ మేరకు ఐసీసీ నేడు ఒక ప్రకటన విడుదల చేసింది.

వివరాల్లోకి వెళితే.. ఈ నెల‌ 14న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో బౌలింగ్‌ చేస్తున్న గుర్నూర్ బ్రార్, బంతిని అందుకుని బ్యాటర్ వైపు అనుచితంగా, ప్రమాదకరంగా విసిరాడు. ఇది ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9ను స్పష్టంగా ఉల్లంఘించడమేనని మ్యాచ్ అధికారులు నిర్ధారించారు. 'అంతర్జాతీయ మ్యాచ్ సందర్భంగా క్రీడాకారుడిపై లేదా సమీపంలోకి అనుచితంగా, ప్రమాదకరంగా బంతిని విసరడం' ఈ నిబంధన పరిధిలోకి వస్తుంది.

ఈ ఆరోపణలను ఆన్‌ఫీల్డ్ అంపైర్లు కుమార్ ధర్మసేన, మైక్ బర్న్స్, థర్డ్ అంపైర్ శామ్ నొగాజ్‌స్కీ, ఫోర్త్ అంపైర్ రస్సెల్ వారెన్ మోపారు. అయితే, గుర్నూర్ బ్రార్ తన తప్పును అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ప్రతిపాదించిన శిక్షకు అంగీకారం తెలపడంతో అధికారిక విచారణ అవసరం లేకుండానే శిక్షను ఖరారు చేశారు. గత 24 నెలల కాలంలో గుర్నూర్‌కు ఇదే మొదటి తప్పిదం కావడం గమనార్హం.

లెవల్ 1 ఉల్లంఘనలకు సాధారణంగా అధికారిక హెచ్చరిక నుంచి ఆటగాడి మ్యాచ్ ఫీజులో 50 శాతం వరకు జరిమానా, ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు విధించే అవకాశం ఉంటుంది. ఒక ఆటగాడి ఖాతాలో 24 నెలల వ్యవధిలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు చేరితే, వాటిని సస్పెన్షన్ పాయింట్లుగా మార్చి నిషేధం విధిస్తారు. రెండు సస్పెన్షన్ పాయింట్లు ఒక టెస్టు లేదా రెండు వన్డేలు/టీ20ల నిషేధానికి సమానం. కాగా, ఈ సిరీస్‌లో తొలి వన్డేను 6 వికెట్ల తేడాతో గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. నేడు కార్డిఫ్‌లో ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది.
Advertisement
Gurnoor Brar
ICC Demerit Point
India vs England ODI
ICC Code of Conduct
Indian Fast Bowler
Cricket Disciplinary Action

More Telugu News