సొంత పార్టీ నేతపై వేటు.. అవినీతికి పాల్పడే మంత్రులు, ఉద్యోగులకు సీఎం విజయ్ వార్నింగ్
- తన ప్రభుత్వంలో లంచాలకు, అవినీతికి తావు లేదన్న విజయ్
- ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే తమ లక్ష్యమని వెల్లడి
- అవినీతికి పాల్పడేవారికి రెండో ఛాన్స్ ఉండదని స్పష్టీకరణ
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన పాలనా దృక్పథం ఏంటో మరోసారి చూపించారు. అవినీతి, అధికార దుర్వినియోగంపై తన మంత్రులకు, ప్రభుత్వ యంత్రాంగానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తన ప్రభుత్వంలో లంచాలకు, అవినీతికి తావులేదని... తప్పు చేసిన వారికి రెండో అవకాశం ఉండే ప్రసక్తే లేదని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజలకు పూర్తి పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.
సొంత పార్టీ నేతపైనే వేటు: ఇటీవల తమిళనాడు వెల్ఫేర్ అసోసియేషన్ చెంగల్పట్టు ఈస్ట్ జిల్లా జాయింట్ సెక్రటరీ వీరాస్వామి (టీవీకే పార్టీ) లంచం తీసుకుంటున్నట్లు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై తీవ్ర రాజకీయ విమర్శలు రావడంతో... విజయ్ ఏమాత్రం ఉపేక్షించకుండా ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవుల నుంచి తక్షణమే తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పోలీసులు కూడా వీరాస్వామిని అరెస్ట్ చేశారు.
ఇటీవల కరూర్‌లో జరిగిన ప్రజాసభలో విజయ్ మాట్లాడుతూ ప్రజలకు కొండంత భరోసా ఇచ్చారు. "ఎవరైనా లంచం అడిగితే నిర్భయంగా 'ఇవ్వను' అని చెప్పండి. మీ వెనుక నేను ఉంటాను. ఒకవేళ ఇంకా ఒత్తిడి చేస్తే... ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న విజయ్ మా వెన్నంటి ఉన్నాడని ధైర్యంగా చెప్పండి" అంటూ ప్రజల్లో ధైర్యాన్ని నింపారు. ప్రజా ప్రభుత్వంలో అవినీతిని కూకటివేళ్లతో నిర్మూలించడానికి తాము కట్టుబడి ఉన్నామని... ప్రజల సహకారంతోనే ఈ మార్పు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సొంత పార్టీ కీలక నేతపైనే కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా... అవినీతి విషయంలో తాను ఎంత కఠినంగా ఉంటానో విజయ్ చెప్పకనే చెప్పినట్లయింది.