డబ్బుల కోసమే సినిమాల్లోకి వచ్చా.. ఒకప్పుడు కూలీ పని కూడా చేశా: విజయ్ సేతుపతి
- చిన్నప్పుడు తన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేదన్న విజయ్ సేతుపతి
- అప్పులవాళ్లు ఇంటిపైకి గొడవకు వచ్చేవారని వెల్లడి
- సినిమాల్లోకి రాకముందు ఎన్నో పనులు చేసిన సేతుపతి
సినిమా పరిశ్రమలో ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా, కేవలం తన అద్భుత నటనతో 'మక్కల్ సెల్వన్' (ప్రజల నటుడు)గా ఎదిగిన విజయ్ సేతుపతి.. తమిళ, తెలుగు ప్రేక్షకులలో సంపాదించుకున్న గుర్తింపు ప్రత్యేకమైనది. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన తన చిన్ననాటి కష్టాలు, కుటుంబ ఆర్థిక ఇబ్బందుల గురించి పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"చిన్నప్పుడు మా కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది. మా నాన్న మా కోసమే చాలా అప్పులు చేశారు. అవి తీర్చలేక సతమతమయ్యేవాళ్లం. కొన్నిసార్లు అప్పులవాళ్లు మా ఇంటిపైకి గొడవకు వచ్చేవారు. ఆ సమయంలో మా నాన్న ఒంటరిగా బాధపడకూడదని నేను ఎప్పుడూ ఆయన పక్కనే కూర్చునేవాడిని" అని సేతుపతి గుర్తుచేసుకున్నారు.
ఎన్ని కష్టాలున్నా ప్రతిరోజు రాత్రి 9.30 గంటలకు నాన్న బుల్లెట్ బండిపై వస్తూ ఫ్రైడ్ రైస్ తెచ్చేవారని, కుటుంబమంతా కలిసి దాన్ని పంచుకుని తినే ఆ క్షణాలు తన జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకాలని చెప్పారు.
నటుడు అవ్వాలనేది విజయ్ సేతుపతి లక్ష్యం కాదట. కేవలం కుటుంబ బాధ్యతలు, డబ్బుల కోసమే ఆయన రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సినిమాల్లోకి రాకముందు ఆయన స్కూల్ రోజుల్లో కూలీ పనికి వెళ్లారు. ఆ తర్వాత రిటైల్ స్టోర్‌లో సేల్స్‌మ్యాన్‌గా, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో క్యాషియర్‌గా, ఫోన్ బూత్ ఆపరేటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత దుబాయ్ వెళ్ళి అక్కడ అకౌంటెంట్‌గానూ ఉద్యోగం చేశారు.
దుబాయ్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత నాటక రంగానికి చెందినవారితో ఏర్పడిన పరిచయమే విజయ్ సేతుపతి జీవితాన్ని మలుపు తిప్పింది. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ.. 'తెన్మేర్కు పరువకాట్రు' చిత్రంతో హీరోగా మారారు. ఆ తర్వాత 'సూదు కవ్వమ్', 'విక్రమ్ వేద', 'పిజ్జా', 'మహారాజా' వంటి విలక్షణమైన చిత్రాలతో స్టార్ హీరోగా నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన ‘ట్రైన్’, ‘స్లమ్ డాగ్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.