డబ్బున్నంత మాత్రాన ఈ క్లబ్ లో సభ్యత్వం రాదు.. టెక్ దిగ్గజాలకు 'బిలియనీర్ బంకర్' షాక్

Indian Creek Island Billionaire Bunker shock to tech giants Zuckerberg and Bezos
  • ఇండియన్ క్రీక్ ఐలాండ్‌లో విలాసవంత భవనాలు కొనుగోలు చేసిన  జుకర్‌బర్గ్, బెజోస్‌
  • అక్కడి ప్రతిష్టాత్మక కంట్రీ క్లబ్‌లో సభ్యత్వం కోసం కఠిన నిబంధనలు
  • డబ్బు కంటే సాంఘిక సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తున్న క్లబ్ యాజమాన్యం
  • సభ్యుల నామినేషన్, బోర్డు ఆమోదం తప్పనిసరి కావడంతో తప్పని నిరీక్షణ
ప్రపంచ ప్రసిద్ధ టెక్ దిగ్గజాలు మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్‌ వంటి కుబేరులకు కూడా కొన్ని చోట్ల ప్రవేశం అంత సులభం కావడం లేదు. వాస్తవానికి జుకర్ బర్గ్, బెజోస్ తమ సంపదతో ఏకంగా కొన్ని దేశాలనే కొనుగోలు చేసే సత్తా ఉన్నావారే. కానీ, ఫ్లోరిడాలోని ఇండియన్ క్రీక్ ఐలాండ్‌లో వందల మిలియన్ల డాలర్లు వెచ్చించి విలాసవంతమైన భవనాలను కొనుగోలు చేసినప్పటికీ, అక్కడి ప్రతిష్ఠాత్మక కంట్రీ క్లబ్‌లో సభ్యత్వం పొందడం వారికి పెను సవాలుగా మారింది. "బిలియనీర్ల బంకర్"గా పేరుగాంచిన ఈ ద్వీపంలో ఆస్తి ఉన్నంత మాత్రాన క్లబ్‌లో సభ్యత్వం లభిస్తుందనే గ్యారెంటీ లేదు.

ఇండియన్ క్రీక్ కంట్రీ క్లబ్ సభ్యత్వం అనేది కేవలం సంపదతో ముడిపడి ఉన్న అంశం కాదు. సుమారు 300 మంది సభ్యులకు మాత్రమే పరిమితమైన ఈ క్లబ్‌లో చేరాలంటే అత్యంత కఠినమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. కొత్తగా చేరాలనుకునే వ్యక్తిని ఇప్పటికే సభ్యుడిగా ఉన్న వారే నామినేట్ చేయాలి. అనంతరం 15 మంది సభ్యులతో కూడిన బోర్డు సదరు దరఖాస్తును క్షుణ్ణంగా సమీక్షించి, కనీసం 75 శాతం మంది ఆమోదం తెలిపితేనే సభ్యత్వాన్ని ఖరారు చేస్తుంది. ఏ ఒక్కరు వ్యతిరేకించినా ఆ దరఖాస్తు శాశ్వతంగా తిరస్కరణకు గురవుతుంది. ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ అనే విధానం ఉండదు. ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో ఎవరైనా మరణించినా లేదా సభ్యత్వ రుసుము చెల్లించకపోయినా మాత్రమే కొత్తవారికి అవకాశం లభిస్తుంది.

ఇటీవల మార్క్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్ కలిసి ఈ ద్వీపంలో సుమారు 150 నుంచి 200 మిలియన్ డాలర్ల విలువైన 'వాటర్‌ఫ్రంట్ ఎస్టేట్‌'ను కొనుగోలు చేశారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు కూడా ఇక్కడ పలు విలువైన ఆస్తులు ఉన్నాయి. ఎన్‌ఎఫ్‌ఎల్ దిగ్గజం టామ్ బ్రాడీ, డేవిడ్ బెక్‌హామ్ వంటి ప్రముఖులు వీరికి పొరుగువారే కావడం గమనార్హం. అయినప్పటికీ, క్లబ్ యాజమాన్యం కేవలం ఆర్థిక స్థితుగతుల కంటే అభ్యర్థికి ఉన్న "సాంఘిక అనుకూలత"కే అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది.

సుమారు 300 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ద్వీపానికి ప్రత్యేక పోలీసు విభాగంతో పాటు 24 గంటల నిరంతర బోట్ పెట్రోలింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో సంపద పన్నుపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఫ్లోరిడాలో రాష్ట్ర ఆదాయపు పన్ను లేకపోవడంతో సిలికాన్ వ్యాలీ కుబేరులు ఇక్కడికి తరలివచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Advertisement
Indian Creek Island
Mark Zuckerberg
Jeff Bezos
Billionaire Bunker
Indian Creek Country Club
Florida Luxury Real Estate

More Telugu News