అంత్యక్రియల్లో ఆంబోతులా రంకెలేశారు: అంబటిపై బుచ్చయ్య చౌదరి ఫైర్
- ముద్రగడ అంత్యక్రియల సందర్భంగా పోలీసులను అడ్డుకున్న అంబటి
- చావు దగ్గర నీచమైన రాజకీయం చేశారని బుచ్చయ్య చౌదరి మండిపాటు
- జగన్ ఎక్కడకు వెళ్లినా అల్లర్లు సృష్టిస్తున్నారని విమర్శ
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేళ చోటుచేసుకున్న పరిణామాలు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రవర్తనపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను గౌరవప్రదంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుంటే, అంబటి రాంబాబు పెద్దపెద్దగా అరుస్తూ ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని బుచ్చయ్య చౌదరి తీవ్రంగా తప్పుబట్టారు.
"ఒక మహోన్నత నేత అంత్యక్రియలు జరుగుతుంటే... అక్కడ అంబటి రాంబాబు ఒక ఆంబోతులాగా రంకెలేస్తూ ప్రవర్తించడం అత్యంత దారుణం. బతికున్నప్పుడు ముద్రగడను అవమానించారు... ఇప్పుడు చావు దగ్గర కూడా నీచమైన రాజకీయం చేయడం వైసీపీ నేతలకే చెల్లింది" అని ధ్వజమెత్తారు.
కన్న తండ్రి చివరి చూపు కోసం వచ్చిన ముద్రగడ కుమార్తెను భౌతికకాయం వద్దకు రానివ్వకుండా అడ్డుకోవడాన్ని బుచ్చయ్య చౌదరి తీవ్రంగా ఖండించారు. కుటుంబంలో ఇలాంటి గొడవలు పెట్టడం, కన్నబిడ్డను దూరం చేయడం ఏ రకమైన సంస్కృతి అని ఆయన ప్రశ్నించారు.
వైసీపీ అధినేత జగన్ ఎక్కడికి వెళ్లినా అక్కడ అల్లర్లు సృష్టించడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. కేవలం రాజకీయ మైలేజ్, హైప్ క్రియేట్ చేసుకోవడం కోసమే ఇలాంటి శవ రాజకీయాలు, డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అంత్యక్రియలకు వెళుతూ కూడా భారీ ర్యాలీలు చేయడం ఏంటని నిలదీశారు.