E20 పెట్రోల్‌తో కారు పాడైంది.. మారుతికి భారీ షాక్ ఇచ్చిన కన్స్యూమర్ కోర్టు

Maruti Suzuki car damaged by E20 petrol as Consumer Court delivers major shock
  • E20 పెట్రోల్‌తో పాడైన గ్రాండ్ విటారా కారు
  • కొత్త వాహనం లేదా పూర్తి డబ్బు వాపస్ ఇవ్వాలన్న కోర్టు
  • మారుతి సుజుకికి లక్ష రూపాయల జరిమానా
  • దేశంలో E20 ఇంధనంపై ఇలాంటి తీర్పు ఇదే తొలిసారి
  • ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై పెరుగుతున్న ఆందోళనలు
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20) వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల కోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది. E20 ఇంధన వినియోగం కారణంగా దెబ్బతిన్న మారుతీ గ్రాండ్ విటారా కారు స్థానంలో E20 ఇంధనంతో పనిచేసే కొత్త వాహనాన్ని అందించాలని, లేదా కొనుగోలు మొత్తాన్ని పూర్తిగా వాపసు చేయాలని మారుతీ సుజుకీ సంస్థను, సదరు డీలర్‌ను ఆదేశించింది. ఈ తరహా వివాదంలో దేశంలోనే వెలువడిన తొలి తీర్పు ఇదే కావడం విశేషం.

రాయ్‌పూర్‌కు చెందిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రేమ్‌రాజ్ దేవతా 2023లో 'మారుతి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ జెటా ప్లస్' మోడల్‌ను కొనుగోలు చేశారు. అయితే, కారులో E20 పెట్రోల్ వినియోగించినప్పటి నుంచి ఇంజిన్ తరచూ నిలిచిపోవడంతో పాటు పనితీరులో లోపాలు తలెత్తుతున్నాయని ఆయన వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. 

ఈ కేసును విచారించిన కోర్టు, జూలై 14న 23 పేజీల సమగ్ర తీర్పును వెలువరించింది. సదరు వాహనం E20 ఇంధనానికి అనుకూలమైనది కాదని, విక్రయ సమయంలో ఈ విషయాన్ని వినియోగదారుడికి వెల్లడించకపోవడం 'సేవా లోపం' మరియు అనుచిత వ్యాపార విధానం కిందకు వస్తుందని కోర్టు స్పష్టం చేసింది.

తీర్పు వెలువడిన 45 రోజుల్లోగా ఫిర్యాదుదారుకు కొత్త కారును అందజేయాలని, లేనిపక్షంలో వాహనం ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.29 లక్షలు, ఆర్‌టీఓ ఛార్జీలు రూ. 1.86 లక్షలు, ఇన్సూరెన్స్ ప్రీమియం రూ. 34,644 కలుపుకుని మొత్తం రూ. 20.50 లక్షలను వాపసు చేయాలని ఆదేశించింది. వీటితో పాటు, వినియోగదారుడు ఎదుర్కొన్న మానసిక ఆవేదనకు పరిహారంగా రూ. 1 లక్ష, న్యాయపోరాట ఖర్చుల నిమిత్తం మరో రూ. 10,000 చెల్లించాలని తీర్పులో పేర్కొంది.

కాగా, ఇంధనం నాణ్యత లోపం లేదా కల్తీ కారణంగానే సమస్య తలెత్తిందని, తమ తయారీలో ఎటువంటి లోపం లేదని మరుతీ సుజుకీ సంస్థ మరియు డీలర్ వాదించారు.  ఈ తీర్పుపై ఉన్నత ఫోరమ్ లలో అప్పీల్ చేసుకునే అవకాశం సదరు సంస్థకు ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇంధన రకం మరియు అనుకూలతపై స్పష్టత లేని సందర్భాల్లో ఈ తీర్పు భవిష్యత్తులో ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Maruti Suzuki
E20 Petrol
Consumer Court Verdict
Maruti Grand Vitara
Engine Failure

More Telugu News