ఖైరతాబాద్‌లో కొలువుదీరిన బడా గణేశ్‌.. గవర్నర్‌ దంపతుల తొలి పూజ

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన బడా గణేశ్‌.. గవర్నర్‌ దంపతుల తొలి పూజ

Khairatabad Bada Ganesh Inaugurated Governor Performs First Puja
  • 69 అడుగుల ఎత్తులో బడా గణేశ్‌
  • పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం
  • ఖైరతాబాద్‌ గణేశుడికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందన్న గవర్నర్‌
  • 72 ఏళ్లుగా ఉత్సవాలు నిర్వహించడం విశేషమని వ్యాఖ్య
  • ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష
వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లో ప్రసిద్ధ బడా గణేశ్‌ కొలువుదీరాడు. 69 అడుగుల ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ రూపంలో దర్శనమిస్తున్న గణనాథుడికి తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా తొలి పూజలు నిర్వహించారు.

తొలుత మంత్రి పొన్నం ప్రభాకర్‌, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌, గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యులు గవర్నర్‌ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం వారిని విగ్రహం వద్దకు తీసుకెళ్లారు. అర్చకుల ఆధ్వర్యంలో గవర్నర్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఖైరతాబాద్‌ గణనాథుడికి పట్టువస్త్రాలు సమర్పించారు.

పూజల అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ.. గణేశ్‌ ఉత్సవాలు మహారాష్ట్రలో ప్రారంభమైనా ఖైరతాబాద్‌ గణేశుడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 72 ఏళ్లుగా ఇక్కడ భారీ గణేశ్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించడం విశేషమని చెప్పారు. గణపతి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

మరోవైపు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణనాథుడికి భారీ కండువా, యజ్ఞోపవీతం సమర్పించారు. బడా గణేశుడి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివస్తుండటంతో ఖైరతాబాద్‌ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
Advertisement
Khairatabad Ganesh
Shiv Pratap Shukla
Hyderabad Ganesh Chaturthi
Panchamukha Sankatahara Maha Ganapati
Ponnam Prabhakar
Bada Ganesh Khairatabad

More Telugu News