అమెరికాలో ఇంధన మంటలు.. రష్యన్ రిఫైనరీలపై దాడులు వెంటనే ఆపాలని జెలెన్స్కీకి ట్రంప్ హెచ్చరికలు
- అమెరికాలో ఆకాశాన్నంటుతున్న డీజిల్, గ్యాసోలిన్ ధరలు
- రష్యాపై ఉక్రెయిన్ దాడులతో దెబ్బతిన్న అంతర్జాతీయ ముడిచమురు సరఫరా
- తన ఓటు బ్యాంకుపై ప్రభావం పడకూడదని భావిస్తున్న ట్రంప్
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో... దేశీయంగా డీజిల్, గ్యాసోలిన్ ధరలు ఆకాశాన్ని తాకడం అమెరికా రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇంధన ధరల భారాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాలోని చమురు రిఫైనరీలపై వరుస డ్రోన్ దాడులు చేయడం తక్షణమే నిలిపివేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని ఆయన ఆదేశించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఉక్రెయిన్ జరుపుతున్న ఈ దాడుల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరా వ్యవస్థ దెబ్బతిని, గ్లోబల్ మార్కెట్‌లో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఇది కాస్తా అమెరికాలో డీజిల్, పెట్రోల్ ధరల తీవ్ర పెరుగుదలకు కారణమవుతోందని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. ఎన్నికల వేళ ఈ ఇంధన ధరల ప్రభావం తమ ఓటు బ్యాంకుపై పడకుండా ఉండేందుకు, ఉక్రెయిన్‌కు ఇచ్చే సైనిక సహాయాన్ని ఆసరాగా చేసుకుని దాడులను కట్టడి చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా అవలంబిస్తున్న దౌత్య వ్యూహాలపై సరికొత్త చర్చకు దారితీసింది.