టైమ్‌ లేక ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ తింటున్నారా? ఈ చిన్న మార్పులు చేసుకుంటే ఆరోగ్యానికి మేలు!

టైమ్‌ లేక ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ తింటున్నారా? ఈ చిన్న మార్పులు చేసుకుంటే ఆరోగ్యానికి మేలు!

Eating packaged food due to lack of time these small changes are good for health
  • బ్రేక్‌ఫాస్ట్‌లో ప్యాకేజ్డ్‌ ఫుడ్‌కు బదులు ఓట్స్‌, నట్స్‌, సీడ్స్ తీసుకోవాలని నిపుణుల సూచన
  • టీతో బిస్కెట్లకు ఆరోగ్యకర ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని సలహా
  • నూడుల్స్‌లో కూరగాయలు, గుడ్డు, పనీర్‌ కలుపుకొంటే బెటర్‌
  • ఫ్లేవర్డ్‌ యోగర్ట్‌ బదులు పెరుగులో పండ్లు, నట్స్‌ వేసుకోవచ్చని సలహా
  • జ్యూస్‌ కంటే పండ్లు తింటే ఫైబర్ కూడా అందే అవకాశం
  • ప్యాకేజ్డ్‌ సాస్‌ల వినియోగం తగ్గించాలని సూచన
ఉరుకులు పరుగుల జీవితంలో సమయం లేక ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో చాకోస్‌.. టీతో బిస్కెట్లు.. పని మధ్యలో చిప్స్‌.. రాత్రికి ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌.. ఇలా మనకు తెలియకుండానే అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ రోజువారీ ఆహారంలో భాగమైపోతోంది. అప్పుడప్పుడు వీటిని తినడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ తరచూ తింటే సమతుల్యమైన ఆహారం అందక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

అందుకే ఒక్కసారిగా ఆహారపు అలవాట్లన్నీ మార్చాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఎక్కువగా తినే ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ను గుర్తించి.. దానికి బదులుగా సులభమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం మంచిదని ప్రముఖ న్యూట్రిషనిస్ట్‌ ఎశాంకా వాహీ సూచిస్తున్నారు.

బ్రేక్‌ఫాస్ట్‌లో చిన్న మార్పు: ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌కు బదులు పాలు, ఓట్స్‌, నట్స్‌, సీడ్స్‌ తీసుకోవచ్చు. కూరగాయల పోహా, వేరుశెనగలు కూడా మంచి ప్రత్యామ్నాయం.

టీతో బిస్కెట్లకు బదులు: రోజూ బిస్కెట్లు తినే అలవాటు ఉంటే కాల్చిన శనగలు, మఖానా, పండ్లు, కొద్దిగా నట్స్‌ తీసుకోవచ్చు. ఇంట్లో తయారుచేసిన చుడువా కూడా ఓ మంచి ఆప్షన్‌.

ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ ఇలా: పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. వాటిలో కూరగాయలు, గుడ్డు, టోఫు లేదా పనీర్‌ కలిపితే భోజనం మరింత బ్యాలెన్స్‌డ్‌గా మారుతుంది.

ఫ్లేవర్డ్‌ యోగర్ట్‌ బదులు: ప్లెయిన్‌ పెరుగు తీసుకుని అందులో పండ్లు, నట్స్‌ కలుపుకోవచ్చు. కొన్ని ఫ్లేవర్డ్‌ యోగర్ట్‌లలో అదనపు చక్కెర ఉండొచ్చు.

జ్యూస్‌ బదులు పండ్లు: ఆరెంజ్‌, జామ, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్లను నేరుగా తినడం మంచిది. పండ్లలో ఉండే ఫైబర్‌ కూడా అందుతుంది.

సాస్‌లు, డ్రెస్సింగ్స్‌ కూడా గమనించాలి: కెచప్‌, ప్యాకేజ్డ్‌ డిప్స్‌, సలాడ్‌ డ్రెస్సింగ్స్‌ రోజూ వాడుతుంటే వాటి స్థానంలో పుదీనా-కొత్తిమీర చట్నీ, మసాలా పెరుగు, నిమ్మరసం, హెర్బ్స్‌ వంటివి ఉపయోగించవచ్చు.

అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ను పూర్తిగా వంటగదినుంచి తొలగించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి అన్నింటినీ మార్చడం కంటే.. రోజూ తినే ఆహారంలో ఒకటి, రెండు చిన్న మార్పులు చేసుకుని వాటిని అలవాటుగా మార్చుకోవడం సులభమని సూచిస్తున్నారు.
Advertisement
Packaged Food
Ultra Processed Food
Healthy Food Swaps
Eshanka Wahi
Nutritionist Tips
Healthy Breakfast

More Telugu News