కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్లు కనపడట్లేదా?: బండి సంజయ్
- ఒవైసీ కాలేజీ చెరువులో లేేదని నమ్మించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోందన్న బండి సంజయ్
- ఓటు బ్యాంకు రాజకీయాలకు అనుగుణంగా ఎఫ్‌టీఎల్ పరిధిని మారుస్తోందని విమర్శ
- నచ్చని వారిని టార్గెట్ చేసుకుని దాడులు చేయడం సరికాదని హితవు
ప్రపంచమంతా చూస్తున్నా.. ఒవైసీ కళాశాల చెరువులో లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా నమ్మించే ప్రయత్నం చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. నిరుపేదల ఇళ్లను కూల్చడానికి ఉన్న ఉత్సాహం, అందరికీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్న ఈ భారీ ఆక్రమణలపై ఎందుకు చూపించడం లేదని నిలదీశారు. రేవంత్ రెడ్డి సర్కార్‌కు నిజంగానే కంటిచూపు సమస్య ఉందా? లేక ఎంఐఎంతో ఉన్న రాజకీయ బంధం వల్ల ఆ సంకల్పం లోపించిందా? అంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నాయకుల కంటి జబ్బును నయం చేసేందుకు బీజేపీ కార్యకర్తలంతా కలిసి ఉచిత నేత్ర పరీక్ష శిబిరాలు నిర్వహించాలని బండి సంజయ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కళ్లు పరీక్షించాక కూడా అక్కడ చెరువు ఆక్రమణ కనిపించకపోతే, అది కంటి లోపం కాదని, కచ్చితంగా రాజకీయ లోపమేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ అవసరాలకు, ఓటు బ్యాంకు రాజకీయాలకు అనుగుణంగా ఎఫ్‌టీఎల్ పరిధి గీతలను ఇష్టమొచ్చినట్లు మారుస్తోందనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో బలంగా వ్యక్తమవుతున్నాయన్నారు.
చట్టం ముందు అందరూ సమానమేనని కాగితాల మీద చెప్పే ప్రభుత్వం... ఆచరణలో మాత్రం పేదలకు ఒక న్యాయం, అధికార పక్షానికి దగ్గరగా ఉండే ఎంఐఎం లీడర్లకు మరో న్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. నచ్చిన వారిని వదిలేసి, నచ్చని వారిపై ఎంపిక చేసుకుని మరీ దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. చెరువుల సంరక్షణ విషయంలో ప్రభుత్వం ఈ ద్వంద్వ వైఖరిని పక్కనబెట్టాలని డిమాండ్ చేశారు.