తోటి పిల్లల వేధింపులు... తల్లిదండ్రులు పిల్లలకు తప్పక నేర్పాల్సిన ఐదు విషయాలు

Bullying Parenting tips to help children face school harassment
  • పిల్లలు ఏదో ఒకచోట వేధింపులకు గురవుతుంటారు
  • వాళ్లను వదిలెయ్ అని  సలహా ఇవ్వడం సరికాదంటున్న నిపుణులు
  • ఎలా స్పందించాలో ముందే నేర్పాలని సూచన
  • పదే పదే వేధిస్తే టీచర్లు లేదా పేరెంట్స్‌కు చెప్పేలా ప్రోత్సహించాలి
  • ‘నువ్వు ఒంటరివి కాదు’ అనే నమ్మకం ఇవ్వాలి
పాఠశాలలో కానీ, ఆటస్థలంలో కానీ, సోషల్ వర్గాల్లో కానీ చాలా మంది పిల్లలు ఏదో ఒక రూపంలో వేధింపులను ఎదుర్కొంటుంటారు. కొందరిని ఎగతాళి చేయడం, అవమానించడం, కావాలనే ఒంటరిగా ఉంచడం, భయపెట్టడం... ఇవన్నీ దాంట్లో భాగమే. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది తల్లిదండ్రులు ‘‘పట్టించుకోకు... వాళ్లను వదిలెయ్’’ అని సలహా ఇస్తుంటారు. అయితే అది సమస్యను పూర్తిగా పరిష్కరించదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అలా చెప్పడం వల్ల పిల్లలకు పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకునే అవకాశం ఉండదు. దీనిపై టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రత్యేక కథనం వెలువరించింది.

ముందుగానే ధైర్యం నేర్పాలి
వేధింపులు ఎదురయ్యాక ఎలా స్పందించాలనే దానికంటే, అది ఎదురైతే ఎలా నిలబడాలో చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పడం అవసరం. ఎవరైనా రెచ్చగొట్టినా వెంటనే కోపం తెచ్చుకోకుండా ఒకసారి లోతుగా శ్వాస తీసుకోవడం, ప్రశాంతంగా స్పందించడం, వాదనలకు వెళ్లకుండా పరిస్థితిని నియంత్రించడం వంటి విషయాలు వారికి అలవాటు చేయాలి. వేధించేవారు ఎదుటివారి భయం లేదా కోపాన్ని చూసి మరింత రెచ్చిపోతారని, ప్రశాంతంగా ఉండడం వారిని నిరుత్సాహపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఆత్మవిశ్వాసమే ఆయుధం
పిల్లలు నిలబడే తీరు, మాట్లాడే విధానం చాలా ప్రభావం చూపుతాయి. తలను పైకి ఉంచి, కళ్లలోకి చూస్తూ, స్పష్టంగా మాట్లాడే అలవాటు వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే చిన్న విషయాలకు ఫిర్యాదు చేయడానికి, నిజంగా ఇబ్బంది కలిగితే సాయం కోరడానికి ఉన్న తేడాను కూడా వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఎవరైనా పదేపదే వేధిస్తే లేదా భయపెడితే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లేదా పెద్దలకు చెప్పడం బలహీనత కాదని, అది సరైన నిర్ణయమని పిల్లలకు తెలియజేయాలి.

‘నువ్వు ఒంటరివి కాదు’ అనే నమ్మకం ఇవ్వాలి
వేధింపులకు గురైన పిల్లల్లో చాలామంది ‘‘నా వల్లే ఇలా జరుగుతోంది’’ అనే నెగెటివ్ ఆలోచనల్లో పడిపోతారు. అందుకే ‘‘నువ్వు తప్పు చేయలేదు.. వేధింపులకు నువ్వు కారణం కాదు’’ అనే భరోసాను తల్లిదండ్రులు తరచూ ఇవ్వాలి. అలాగే సమస్య వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలో ముందుగానే వారికి తెలియజేయాలి. తల్లిదండ్రులు, తాతయ్య-అమ్మమ్మలు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలు తమకు అండగా ఉంటారనే నమ్మకం పిల్లల్లో ధైర్యాన్ని పెంచుతుంది.

మాట్లాడే ఇంట్లోనే ధైర్యమైన పిల్లలు
వేధింపుల గురించి పిల్లలతో సమస్య వచ్చిన తర్వాత కాదు... సాధారణ రోజుల్లోనే మాట్లాడాలి. వేధింపులు అంటే ఏంటి, ఎలాంటి ప్రవర్తనను సహించకూడదు, ఎప్పుడు సాయం కోరాలి వంటి విషయాలపై తరచూ చర్చించాలి. అప్పుడే పిల్లలు ఇలాంటి పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కోగలుగుతారు. పిల్లల్లో ధైర్యం అంటే కఠినంగా ఉండడం కాదు. ‘‘ఏ సమస్య వచ్చినా నేను ఒంటరిగా లేను. నన్ను నమ్మే వాళ్లు ఉన్నారు’’ అనే విశ్వాసం కల్పించడమే అసలైన పేరెంటింగ్ అని నిపుణులు చెబుతున్నారు.
Advertisement
Bullying
Parenting Tips
Child Safety
School Bullying
Mental Health
Child Confidence

More Telugu News