మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన సొంత నియోజకవర్గం పులివెందులలో ఊహించని పరిణామం ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయన చేపట్టిన ర్యాలీలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరి ఎదురుపడి, సంచలన ఆరోపణలు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో జగన్ పులివెందుల వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో దస్తగిరి అకస్మాత్తుగా ర్యాలీకి ఎదురుగా వచ్చాడు. అతడిని గమనించిన వైసీపీ కార్యకర్తలు, 'దస్తగిరి వచ్చాడు' అంటూ జగన్‌ను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు.

అంతలోనే దస్తగిరి, జగన్ కాన్వాయ్ ముందుకొచ్చి.. "సొంత బాబాయ్ వివేకాను చంపించి మా జీవితాలు నాశనం చేశావ్" అంటూ గట్టిగా నినదించాడు. ఈ అనూహ్య పరిణామంతో జగన్ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. దస్తగిరి మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే అతడిని అడ్డుకుని పక్కకు లాగేశారు. అనంతరం జగన్, దస్తగిరిని చూసీ చూడనట్టుగా తన ర్యాలీలో ముందుకు సాగిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Play video