"నన్ను చంపితే ఇరాన్‌ను ముక్కలు ముక్కలు చేయండి".. అధికారులకు ట్రంప్ సంచలన ఆదేశాలు!

Donald Trump orders to blow Iran to pieces if he is killed
  • తన హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందన్న వార్తలను ఖండించిన ట్రంప్
  • ఇజ్రాయెల్ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టీకరణ
  • తనకేమైనా జరిగితే ఇరాన్‌ను నాశనం చేయాలని ఆదేశాలిచ్చానన్న ట్రంప్
  • అధికారులకు రాతపూర్వక ఆదేశాలు జారీ చేశానని సంచలన వెల్లడి
  • ట్రంప్ వ్యాఖ్యలతో మరింత పెరిగిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్రపన్నుతోందని, ఈ మేరకు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు హెచ్చరించాయంటూ వస్తున్న అంతర్జాతీయ మీడియా కథనాలను ఆయన తోసిపుచ్చారు. అయితే, అదే సమయంలో తనకేమైనా హాని తలపెడితే ఇరాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు తాను ఇప్పటికే రాతపూర్వకంగా ఆదేశాలు జారీ చేశానని బాంబు పేల్చారు.

శుక్రవారం 'న్యూయార్క్ పోస్ట్' ప్రతినిధులతో మాట్లాడిన ట్రంప్.. "అలాంటిదేమీ లేదు, ఇజ్రాయెల్ మాకు ఎలాంటి సమాచారాన్ని అందించలేదు" అని స్పష్టం చేశారు. అయితే, ఇరాన్ హిట్ లిస్ట్‌లో తాను చాలా కాలంగా 'నంబర్ వన్' స్థానంలో ఉన్నాననే విషయాన్ని ఆయన అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఒకవేళ నాకు ఏదైనా జరిగితే.. ఇరాన్ దేశ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా, ఊహించని స్థాయిలో వారిపై బాంబుల వర్షం కురిపించి సర్వనాశనం చేయాలని నేను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాను" అని  తెలిపారు.

కాగా, గురువారం 'ది వాల్ స్ట్రీట్ జర్నల్', 'సీఎన్‌ఎన్' వంటి ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలు కొన్ని కథనాలను ప్రచురించాయి. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కొత్త వ్యూహాన్ని రచిస్తోందని, ఈ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇజ్రాయెల్ అధికారులు వాషింగ్టన్‌తో పంచుకున్నారని ఆ కథనాల్లో పేర్కొన్నాయి. ఈ వార్తలపై వైట్ హౌస్ నేరుగా స్పందించనప్పటికీ, ట్రంప్ వ్యాఖ్యలతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది.

అంతకుముందు టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో సదస్సులో ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. అయినప్పటికీ, టెహ్రాన్‌తో చర్చలను కొనసాగిస్తామని ట్రంప్ తాజాగా పేర్కొనడం గమనార్హం. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
Advertisement
Donald Trump
Iran
Assassination threat
US Iran relations
Israel intelligence
Retaliation orders

More Telugu News