పెళ్లిలో వధువు కొంగు లాగిన పెళ్ళికొడుకు తమ్ముడు.. రణరంగంగా మారిన కల్యాణమండపం!

Groom brother pulls bride saree at wedding ceremony turns into a battlefield
  • ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు
  • మధ్యలోనే ఆగిపోయిన పెళ్లి వేడుక
  • పోలీస్ స్టేషన్‌లో పెద్దల మధ్య రాజీ 
  • చివరకు వివాహం పూర్తి చేసిన కుటుంబ సభ్యులు
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో విచిత్ర ఘటన జరిగింది. వరుడి తమ్ముడు సరదాకి చేసిన పని ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవకు దారితీసింది. పీటల మీద పెళ్లి ఆగిపోయి, విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది. చివరికి పెద్ద మనుషుల మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారమై, వధూవరులు ఒక్కటయ్యారు.

హర్దోయ్‌లో ఓ జంటకు వివాహం జరుగుతోంది. వేడుక చివరి ఘట్టానికి చేరుకున్న సమయంలో వరుడి తమ్ముడు సరదా కోసం వధువు కొంగు లాగాడు. ఈ చర్యపై వధువు బాబాయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న కొందరు బంధువులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పెళ్లి మండపం రణరంగంగా మారింది.

ఈ ఘర్షణలో వరుడి తలకు తీవ్ర గాయమైంది. వధువు తరఫు బంధువు కూడా గాయపడ్డాడు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ పెళ్లిని మధ్యలోనే ఆపేశారు. అనంతరం ఇరు కుటుంబాలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. గురువారం గ్రామ పెద్దల సమక్షంలో పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాలు చర్చలు జరిపాయి. చివరకు రాజీకి వచ్చాయి. గాయపడిన వారి వైద్య ఖర్చుల కోసం రూ. 4,500 చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది.

సమస్య సద్దుమణిగాక, ఇరు కుటుంబాలు తిరిగి గ్రామానికి చేరుకున్నాయి. అదే రోజు సాయంత్రం మిగిలిన వివాహ క్రతువులను పూర్తి చేసి, వధూవరులను ఒక్కటి చేశారు. ఇరువర్గాలు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకున్నాయని, ఎలాంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
Advertisement
Hardoi Wedding Fight
Uttar Pradesh News
Groom Brother Prank
Wedding Saree Pulling Incident
Marriage Brawl Hardoi
Police Station Settlement

More Telugu News