బహామాస్‌లో సముద్రంలో కుప్పకూలిన విమానం.. 10 మంది దుర్మరణం

Bahamas plane crash in sea kills 10 people
  • దేశ స్వాతంత్ర్య దినోత్సవం నాడే ఘటన
  • ఒకే రోజు ఆ సంస్థకు చెందిన రెండు విమానాలకు ప్రమాదం
  • ఫ్లెమింగో ఎయిర్ విమానయాన సంస్థ సర్వీసులను నిలిపివేసిన ప్రభుత్వం 
  • ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్న విమానయాన అధికారులు
బహామాస్‌లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 10 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ చిన్న విమానం సముద్రంలో కుప్పకూలడంతో అందులోని వారంతా ప్రాణాలు కోల్పోయారు. దేశ 53వ స్వాతంత్ర్య దినోత్సవం రోజే ఈ విషాదం చోటుచేసుకోవడంతో బహామాస్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన ప్రభుత్వం, సంబంధిత విమానయాన సంస్థ 'ఫ్లెమింగో ఎయిర్' సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

రాజధాని నసావులోని లిండెన్ పిండ్లింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సెస్నా 402 రకం విమానం శాన్ ఆండ్రోస్ ద్వీపానికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నసావుకు పశ్చిమంగా నార్త్ ఆండ్రోస్ సముద్ర జలాల్లో ఇది కుప్పకూలిపోయింది. ప్రమాదం తర్వాత ఒకరు ప్రాణాలతో బయటపడ్డారని బహామాస్ ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డెవిస్ తొలుత ప్రకటించినా, ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ధ్రువీకరించారు. దీంతో మృతుల సంఖ్య 10కి చేరింది. స్వాతంత్ర్య దినోత్సవం శోకదినంగా మారిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, అదే రోజు అదే సంస్థకు చెందిన మరో విమానం కూడా ప్రమాదానికి గురైంది. మాయాగువానా ద్వీపానికి బయలుదేరిన ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో, పైలట్ దానిని అత్యవసరంగా తిరిగి నసావు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశాడు. ప్రయాణికులంతా దిగిపోయిన కాసేపటికే ఆ విమానంలో మంటలు చెలరేగాయి. ఒకే రోజు రెండు ప్రమాదాలు జరగడంతో, భద్రతా చర్యల్లో భాగంగా ఫ్లెమింగో ఎయిర్.. ‘ఎయిర్ ఆపరేటర్’ సర్టిఫికేట్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ రెండు ఘటనలపైనా బహామాస్ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ సమగ్ర విచారణకు ఆదేశించింది.
Advertisement
Bahamas Plane Crash
Flamingo Air
Philip Brave Davis
Nassau
Cessna 402
Bahamas Independence Day

More Telugu News