ఇథనాల్‌తో నాకు రూపాయి లాభం లేదు.. గడ్కరీ ఘాటు కౌంటర్‌

Nitin Gadkari defends ethanol policy saying he gains no personal profit
  • ఇథనాల్‌తో తనకు లాభం లేదన్న గడ్కరీ
  • ఇథనాల్‌ ఉత్పత్తిలో తమ కంపెనీ వాటా కేవలం 0.07 శాతమేనని వెల్లడి
  • ఆరోపణలను పూర్తిగా ఖండించిన కేంద్ర మంత్రి
  • వాహనాలు దెబ్బతిన్నాయని ఆధారాలు చూపాలని సవాల్‌
  • ఫిర్యాదులు వస్తే విచారణ చేస్తామని హామీ
  • తనపై కుట్ర జరుగుతోందని ఆరోపణ
ఇథనాల్‌ ఇంధన విధానంపై వస్తున్న విమర్శలను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తిప్పికొట్టారు. ఈ విధానం వల్ల తనకు ఎలాంటి వ్యక్తిగత లాభం లేదని స్పష్టం చేశారు. ఇథనాల్‌ కారణంగా వాహనాలు దెబ్బతింటున్నాయనే ఆరోపణలకు ఆధారాలు చూపాలని సవాల్‌ విసిరారు.

‘ఇండియా టుడే’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన గడ్కరీ.. తమ కుటుంబానికి చెందిన చక్కెర పరిశ్రమ ఇథనాల్‌ విధానం కంటే ముందే ఉందన్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న ఇథనాల్‌లో తన వాటా కేవలం 0.07 శాతం మాత్రమేనని చెప్పారు. ఇంత చిన్న వాటాతో తనకు ఆర్థికంగా పెద్ద ప్రయోజనం చేకూరే అవకాశం లేదన్నారు.

ఇథనాల్‌ విధానాన్ని తన ప్రయోజనాల కోసం రూపొందించారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని గడ్కరీ అన్నారు. దేశ ఇథనాల్‌ విధానాన్ని ఒక్క వ్యక్తి నిర్ణయించలేడని చెప్పారు. ప్రస్తుతం దేశంలో సుమారు 550 యూనిట్ల ద్వారా ఏడాదికి దాదాపు 1,500 కోట్ల లీటర్ల ఇథనాల్‌ ఉత్పత్తి జరుగుతోందని వివరించారు.

ఇథనాల్‌ మిశ్రమ విధానాన్ని తాను ఒక్కడే రూపొందించలేదని గడ్కరీ స్పష్టం చేశారు. పెట్రోలియం శాఖ, కేంద్ర మంత్రివర్గం, శాస్త్రీయ పరిశోధనల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తాను ఇథనాల్‌ గురించే కాకుండా ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తున్నానన్నారు. దీని వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గడమే కాక రైతులకు కూడా ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు.

ఇథనాల్‌ మిశ్రమ ఇంధనం వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తున్న వారిని గడ్కరీ ప్రశ్నించారు. నిజంగా అలాంటి ఘటన జరిగితే డీలర్‌తో పాటు తన శాఖకు కూడా ఫిర్యాదు చేయాలని సూచించారు. విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇథనాల్‌ వల్ల వాహనం దెబ్బతిన్న ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పగలరా అని కూడా ప్రశ్నించారు.

మారుతీ సుజుకీ, టయోటా, టాటా మోటార్స్‌, మహీంద్రా వంటి సంస్థల నుంచి ఇథనాల్‌ కారణంగా వాహనాలు దెబ్బతిన్నట్లు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని గడ్కరీ చెప్పారు. ఇటీవల టయోటా వాహనానికి సంబంధించిన ఘటనలో కూడా నీరు కలవడమే సమస్యకు కారణమని విచారణలో తేలిందన్నారు. కొత్త ఇంధన విధానానికి అనుమతి ఇచ్చే ముందు వాహనాలపై ఏళ్ల తరబడి పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు.

తనపై బురదజల్లేందుకు, ఇథనాల్‌ విధానాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని గడ్కరీ ఆరోపించారు. అమెరికా, బ్రెజిల్‌, జపాన్‌, జర్మనీ, థాయ్‌లాండ్‌, స్వీడన్‌ వంటి దేశాల్లో కూడా ఇథనాల్‌ వినియోగం కొనసాగుతోందని చెప్పారు. భారత్‌ అనుసరిస్తున్న విధానం కొత్త ప్రయోగం కాదని, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న విధానమేనని స్పష్టం చేశారు.
Advertisement
Nitin Gadkari
Ethanol Fuel Policy
Alternative Fuels India
Biofuel Benefits
Road Transport Ministry
Sugar Industry India

More Telugu News