దేశాన్ని, హిందూ మతాన్ని అవమానించిన వారిని జగన్ వెనకేసుకొస్తున్నారు: కొల్లు రవీంద్ర

Kollu Ravindra says Jagan supports those who insulted the country and Hindu religion
  • జగన్ పాలనలో బీసీలకు తీరని ద్రోహం జరిగిందన్న కొల్లు రవీంద్ర
  • 1,608 మంది బీసీలు పదవులు కోల్పోయేలా చేసిన ఘనత జగన్‌దేనని విమర్శ
  • ఏపీకి పెట్టుబడులు రావడం జగన్‌కు ఇష్టం లేదని ఆరోపణ

వైసీపీ అధినేత జగన్ దేశాన్ని, హిందూమతాన్ని అవమానించిన వారిని వెనకేసుకొస్తున్నారని ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. రంపచోడవరం మండలం పందిరి మామిడిలో ఈరోజు ఆయన 'నీరా ప్లాంటేషన్‌'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జగన్ వైఖరిపై, గత వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


బీసీలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి... గత ఐదేళ్ల జగన్ పాలనలో బీసీలకు ఘోరమైన ద్రోహం జరిగిందని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఏకంగా 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించి... 1,608 మంది బీసీలు తమ రాజకీయ పదవులను కోల్పోయేలా చేసిన ఘనత జగన్‌దేనని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వైసీపీ నేతలు బీసీ రౌండ్‌టేబుల్ సమావేశాల పేరుతో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీకి భారీగా పెట్టుబడులు రావడం జగన్‌కు అస్సలు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇదే సమయంలో గత ప్రభుత్వ మద్యం విధానంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన రూ. 3,500 కోట్ల లిక్కర్ స్కాం దేశంలోనే అతిపెద్దదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని తెలిపారు. నాసిరకం మద్యంతో వేలాది మంది అమాయకుల ప్రాణాలతో ఆనాడు చెలగాటం ఆడారని ఆరోపించారు. 


అక్టోబర్ నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమలు చేయబోతున్నామని, ఎమ్మార్పీ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా సరే వైన్ షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం విశాఖపట్నం, సూర్యలంక బీచ్‌లలో ఫైవ్ స్టార్ హోటల్స్ భాగస్వామ్యంతో 'బీచ్ షాక్స్' ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

Advertisement
Kollu Ravindra
YS Jagan Mohan Reddy
Andhra Pradesh Excise Policy
BC Reservations AP
Liquor Scam AP
AP Neera Plantation

More Telugu News