తండ్రికి తగ్గ తనయుడు.. శ్రీలంకపై అన్వయ్ ద్రవిడ్ మెరుపు ఇన్నింగ్స్.. త్రుటిలో సెంచరీ మిస్!
- శ్రీలంకతో రెండో యూత్ వన్డేలో రాణించిన అన్వయ్ ద్రవిడ్
- కేవలం 67 బంతుల్లో 87 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్
- అర్జున్ రాజ్‌పుత్‌తో కలిసి 145 పరుగుల కీలక భాగస్వామ్యం
- చివర్లో తడబాటుతో 285 పరుగులకు ఆలౌటైన భారత జట్టు
- ఐదు వికెట్లతో రాణించిన లంక బౌలర్ గిమ్హాన్ మెండిస్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 19వ ఓవర్ ముగిసేసరికి 81 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన 17 ఏళ్ల అన్వయ్ ద్రవిడ్, మరో బ్యాటర్ అర్జున్ రాజ్‌పుత్ (76 పరుగులు) తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 145 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా అన్వయ్ దూకుడుగా ఆడుతూ కేవలం 47 బంతుల్లోనే తన తొలి యూత్ వన్డే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని దూకుడు చూసి శతకం ఖాయమనిపించినా, శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గిమ్హాన్ మెండిస్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 129.85 స్ట్రైక్ రేట్‌తో ఆడిన అన్వయ్ ఇన్నింగ్స్ జట్టు స్కోరును పరుగులు పెట్టించింది.
అర్జున్ రాజ్‌పుత్ కూడా 81 బంతుల్లో 76 పరుగులు చేసి రాణించాడు. అయితే, దిమంత మహవితాన అద్భుతమైన త్రోకు అతను రనౌట్‌గా వెనుదిరిగాడు. కీలక భాగస్వామ్యం విడిపోయిన తర్వాత భారత ఇన్నింగ్స్ మళ్లీ తడబడింది. 263 పరుగుల వద్ద ఏడో వికెట్‌గా అన్వయ్ ఔటైన తర్వాత, భారత టెయిలెండర్లు చేతులెత్తేశారు. కేవలం 22 పరుగుల వ్యవధిలో చివరి మూడు వికెట్లు కోల్పోయి 47.2 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి భారత్‌ను కట్టడి చేశాడు.
మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్‌లో 321 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఇటీవల వినూ మన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అన్వయ్, ఆ టోర్నీలో 220 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ ప్రదర్శనతో రాబోయే అండర్-19 ప్రపంచ కప్‌కు ఎంపికయ్యే అవకాశాలను మరింత మెరుగుపరుచుకున్నాడు. కాగా, అన్వయ్ అన్నయ్య సమిత్ ద్రవిడ్ కూడా ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపికైనా మోకాలి గాయం కారణంగా దూరమయ్యాడు.