నీరవ్‌ మోదీకి అన్ని దారులూ మూసుకుపోయాయి.. ఇక అప్పగింతే?

All doors closed for Nirav Modi will he be extradited now
  • యూరోపియన్‌ కోర్టులోనూ నీరవ్‌కు నిరాశ
  • చివరి న్యాయ అడ్డంకి తొలగినట్లు సమాచారం
  • అప్పగింతకు పరిపాలనాపరమైన ప్రక్రియ ప్రారంభం!
  • 2019 నుంచి లండన్‌ జైలులోనే నీరవ్‌
  • పీఎన్‌బీ మోసం కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు
ఏళ్లుగా చట్టంలోని ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుని భారత్‌కు రాకుండా తప్పించుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి ఇప్పుడు దాదాపు అన్ని దారులూ మూసుకుపోయినట్లు కనిపిస్తోంది. బ్రిటన్‌లోని కోర్టుల నుంచి యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టు వరకు చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలం కావడంతో అతడి అప్పగింతకు చివరి న్యాయ అడ్డంకి కూడా తొలగిపోయినట్లు సమాచారం. ఇక మిగిలింది పరిపాలనాపరమైన ప్రక్రియ మాత్రమే కావడంతో ఎప్పుడైనా భారత్‌కు తీసుకురావచ్చన్న వార్త సంచలనంగా మారింది.

న్యూస్‌18 ఇండియా కథనం ప్రకారం.. బ్రిటన్‌లోని అన్ని కోర్టుల్లో అప్పీలు విఫలమైన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో నీరవ్‌ మోదీ యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టును ఆశ్రయించాడు. అక్కడ కూడా అతడికి అనుకూల ఉత్తర్వులు రాలేదని సమాచారం. దీంతో భారత్‌కు అప్పగింతను అడ్డుకునే చివరి న్యాయ అవకాశం కూడా ముగిసినట్టే అయింది.

దీంతో బ్రిటన్‌ ప్రభుత్వం ఇప్పుడు అప్పగింతకు సంబంధించిన పరిపాలనాపరమైన ప్రక్రియను ప్రారంభించినట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. అవసరమైన అధికారిక ప్రక్రియ పూర్తికాగానే ఎప్పుడైనా నీరవ్‌ మోదీని భారత అధికారులకు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు.

నీరవ్‌ మోదీ 2019 మార్చి నుంచి లండన్‌లోని హెచ్‌ఎంపీ వాండ్స్‌వర్త్‌ జైలులో ఉన్నాడు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.వేల కోట్లు రుణాలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసుల్లో అతణ్ని భారత్‌కు అప్పగించాలని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కోరుతున్నాయి.

2021 ఏప్రిల్‌లో అప్పటి బ్రిటన్‌ హోంశాఖ మంత్రి ప్రీతీ పటేల్‌ అప్పగింత ఉత్తర్వులపై సంతకం చేశారు. అయినప్పటికీ నీరవ్‌ మోదీ వరుసగా అప్పీలు, బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశాడు. అయితే అవన్నీ తిరస్కరణకు గురయ్యాయి. ఈ ఏడాది మార్చిలో తన అప్పగింతను మళ్లీ పరిశీలించాలని కోరాడు. భారత్‌కు వస్తే చిత్రహింసలకు గురయ్యే ప్రమాదం ఉందని వాదించాడు. కానీ దాన్ని కూడా బ్రిటన్‌ కోర్టులు తోసిపుచ్చాయి. అనంతరం యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా ఎలాంటి ఉపశమనం దక్కలేదని తెలుస్తోంది.

ప్రస్తుతం భారత్‌లో నీరవ్‌ మోదీపై మూడు ప్రధాన క్రిమినల్‌ కేసులు కొనసాగుతున్నాయి. పీఎన్‌బీ రుణ మోసం కేసులో సీబీఐ దర్యాప్తు, అదే కేసుకు సంబంధించిన ఈడీ మనీలాండరింగ్‌ విచారణ, అలాగే సాక్ష్యాధారాలు, సాక్షులను ప్రభావితం చేసిన ఆరోపణలపై మరో కేసు నమోదైంది.
Nirav Modi
PNB Scam
UK Extradition
Money Laundering Case
European Court of Human Rights
CBI and ED Investigation

More Telugu News