తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు: టీవీకే ప్రభుత్వంపై గవర్నర్‌కు డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ ఫిర్యాదు!
- పోలీసులను దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు
- క్యాబినెట్ భేటీల్లో అనధికార వ్యక్తుల ప్రమేయం ఉందని ఆరోపణ
- సీఎం విజయ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదుకు డిమాండ్
- ప్రత్యేక సలహాదారులని స్పష్టం చేసిన టీవీకే
డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్‌ఎస్ భారతి నేతృత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించింది. పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాప్రతినిధులను అక్రమంగా అరెస్టులు చేయడం, వేధింపులకు గురిచేయడం, పార్టీ మారేలా ఒత్తిడి తేవడం వంటి చర్యలకు అధికార పక్షం పాల్పడుతోందని ఆరోపించారు.
అనంతరం ఆర్‌ఎస్ భారతి మాట్లాడుతూ.. ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని జాన్, విష్ణురెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు మంత్రుల కంటే ఎక్కువ అధికారాన్ని చెలాయిస్తున్నారని మండిపడ్డారు. వారు ఉన్నత స్థాయి ప్రభుత్వ సమావేశాల్లో పాల్గొంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని, ఇలాంటి దుస్థితి తమిళనాడులో ఎప్పుడూ లేదని అన్నారు. తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా ఆర్ రాధాకృష్ణన్ సహా డీఎంకే ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురిచేసి, డబ్బు ఆశ చూపి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ముఖ్యమంత్రి విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో ఆ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం రాజకీయ కక్షసాధింపేనని ఆరోపించారు.
అంతేకాకుండా, ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్న సీఎం విజయ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని గవర్నర్‌ను డీఎంకే కోరింది. ఇద్దరు డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసేలా విజయ్ స్వయంగా ఒప్పించే ప్రయత్నం చేశారని, రాబోయే ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు వారికి ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారని ఎండీఎంకే జనరల్ సెక్రటరీ వైకో చేసిన బహిరంగ ప్రకటనల ఆధారంగా డీఎంకే ఈ ఫిర్యాదు చేసింది.
మరోవైపు అన్నాడీఎంకే కూడా గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తూ.. ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక ఉన్న అదృశ్య హస్తంపైనా, క్యాబినెట్ భేటీల్లో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయంపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 167ను ఉపయోగించి ప్రభుత్వం నుంచి వివరణ కోరాలని విజ్ఞప్తి చేసింది. బీజేపీ సైతం గవర్నర్‌ను కలిసి ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి క్యాబినెట్ సమావేశానికి హాజరైన జాన్ ఆరోగ్యసామి, విష్ణురెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీనితో పాటు బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఉన్నత విద్యాశాఖ మంత్రి పి.విశ్వనాథన్‌పై విచారణ జరపాలని కోరింది.
అయితే ఈ ఆరోపణలను అధికార టీవీకే పార్టీ తీవ్రంగా ఖండించింది. జాన్ ఆరోగ్యసామి, విష్ణురెడ్డిలను ముఖ్యమంత్రికి ప్రత్యేక సలహాదారులుగా నియమించామని, కాబట్టి వారు ప్రైవేట్ వ్యక్తులు కారని అధికార పక్షం స్పష్టం చేసింది. దీనిపై గవర్నర్ అర్లేకర్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్య సంస్థలను కాపాడేందుకు తక్షణ రాజ్యాంగపరమైన జోక్యం, స్వతంత్ర విచారణ, తగిన చర్యలు తీసుకోవాలని డీఎంకే వినతిపత్రంలో కోరినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు.