విశాఖ మత్స్యకారుల గల్లంతు.. గాలింపు చర్యలపై సీఎం చంద్రబాబు ఆరా
- విశాఖ నుంచి వేటకు వెళ్లిన 7గురు మత్స్యకారులు గల్లంతు
- గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- కోస్టుగార్డు, నేవీ నౌకలు, హెలికాప్టర్లతో గాలింపు
- సాంకేతిక లోపం వల్లే బోటు చిక్కుకుందని అధికారుల అనుమానం
- మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలని మంత్రి, నేతలకు సీఎం సూచన
విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు 'INDAP-VS-MM-83' అనే బోటులో ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారని అధికారులు సీఎంకు వివరించారు. 4వ తేదీ మధ్యాహ్నానికే వారు తిరిగి రావాల్సి ఉండగా, ఇప్పటికీ తీరానికి చేరలేదని తెలిపారు. గంగవరం సముద్ర తీరానికి సమీపంలో బోటులో సాంకేతిక లోపం తలెత్తినట్లు భావిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం కోస్టుగార్డు, నేవీ, మెరైన్ పోలీసు విభాగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని, ఈ ఉదయం నుంచి నౌకాదళ హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దించినట్లు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం, గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాలని మెరైన్ ఐజీ, విశాఖ సీపీలకు సూచించారు. ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఆదేశించారు. అదే సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పి అండగా నిలవాలని మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులను కోరారు.