అవకాశాల కోసం రాజీ పడొద్దు: యువ నటులకు కాజల్ హితవు
- అవకాశాల కోసం ఆత్మగౌరవం వదులుకోవద్దన్న కాజల్
- ఇబ్బందికర విషయాలకు 'నో' చెప్పే ధైర్యం ఉండాలని వెల్లడి
- తాను కూడా కొన్ని పాత్రలను తిరస్కరించానని వెల్లడి
- 'ది ఇండియా స్టోరీ' సినిమా ప్రమోషన్లో కీలక వ్యాఖ్యలు
"అవకాశాల కోసం ప్రతిదానికీ 'యస్' చెప్పాల్సిన అవసరం లేదు. మనకు నచ్చని లేదా అసౌకర్యంగా అనిపించే విషయాలకు ధైర్యంగా 'నో' చెప్పడం నేర్చుకోవాలి" అని కాజల్ స్పష్టం చేశారు. తన కెరీర్లోనూ ఇబ్బందికరంగా అనిపించిన బికినీ సన్నివేశాలను, శృతిమించిన శృంగార దృశ్యాలను తిరస్కరించానని.. వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవడం అత్యంత ప్రధానమని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం సోషల్ మీడియా కారణంగా యువ నటీనటులు విపరీతమైన ఒత్తిడిని, అవాస్తవిక సౌందర్య ప్రమాణాలను ఎదుర్కొంటున్నారని కాజల్ ఆవేదన వ్యక్తం చేశారు. "వారిని చూస్తుంటే బాధగా ఉంది. ఈ ఒత్తిళ్లను తట్టుకుని వారు పరిశ్రమలో నిలదొక్కుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు. తన కెరీర్ ఆరంభంలో బరువు పెరగడం, తగ్గడం వంటి అంశాలపై కొన్ని సూచనలు ఎదురైనప్పటికీ, ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే నాటి ఒత్తిడి చాలా తక్కువేనని ఆమె గుర్తుచేసుకున్నారు.
‘ది ఇండియా స్టోరీ’ చిత్రం కోసం చేసిన పరిశోధన ద్వారా దేశంలోని ఆహార భద్రత సమస్యలపై తనకు అవగాహన పెరిగిందని, ఆ ప్రభావంతో తన కుటుంబ జీవనశైలిలోనూ కొన్ని మార్పులు చేసుకున్నానని కాజల్ వివరించారు.