వైభవ్ సూర్యవంశీ అద్భుతాలు చేస్తాడు.. కానీ!: చమిందా వాస్
- వైభవ్ అంతర్జాతీయ స్థాయిలో కచ్చితంగా రాణిస్తాడన్న శ్రీలంక దిగ్గజం
- కానీ అతనిపై అనవసరమైన ఒత్తిడి పెట్టవద్దని కీలక సూచన
- తెలంగాణ టీ20 లీగ్ యువ క్రికెటర్లకు గొప్ప వేదిక అని ప్రశంస
- భారత దేశవాళీ క్రికెట్ వ్యవస్థ ఎంతో పటిష్ఠంగా ఉందని కితాబు
"భారత్ ఎన్నో ఏళ్లుగా ప్రపంచస్థాయి యువ ప్రతిభావంతులను వెలుగులోకి తెస్తోంది. కొత్త సంచలనం సూర్యవంశీ వయసు చాలా చిన్నది. అతనికి టీమిండియాకు ఆడే అవకాశం వస్తుందని, అద్భుతంగా రాణిస్తాడని నాకు నమ్మకం ఉంది. కానీ, ప్రజలందరినీ నేను కోరేది ఒక్కటే, అతనిపై ఎలాంటి ఒత్తిడి పెట్టొద్దు. అతడిని స్వేచ్ఛగా ఎదగనిస్తే, భారత క్రికెట్‌కు గొప్ప విజయాలు అందిస్తాడు" అని వాస్ వివరించాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన సూర్యవంశీ, 237.30 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఎంపికైనప్పటికీ, అంతకుముందు ఐర్లాండ్‌తో సిరీస్‌లో అతనికి ఆడే అవకాశం రాలేదు.
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20) నిర్వహణపై వాస్ ప్రశంసలు కురిపించాడు. ఇలాంటి టోర్నమెంట్లు యువ ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నాడు. "హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తొలిసారిగా తెలంగాణ టీ20 లీగ్ నిర్వహించడం యువతకు చాలా మంచిది. అన్ని జట్లలోనూ ఎంతో ప్రతిభ కనిపిస్తోంది. ముఖ్యంగా మా పాలమూరు స్ట్రైకర్స్‌లో కొందరు యువకులు అద్భుతంగా రాణిస్తున్నారు. జట్టుగా మేం రాణించకపోయినా, వ్యక్తిగతంగా కొందరి ప్రదర్శన చాలా బాగుంది" అని తెలిపాడు.
భారత దేశవాళీ క్రికెట్ వ్యవస్థపై కూడా వాస్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. "భారత క్రికెట్ యువత కోసం గొప్ప కార్యక్రమాలు చేస్తోంది. కేవలం హైదరాబాద్‌లోనే కాదు, దేశంలోని ప్రతి రాష్ట్రంలో టీ20 టోర్నమెంట్లు నిర్వహించి యువతకు అవకాశాలు, అనుభవాన్ని అందిస్తున్నారు. చాలా మంది క్రికెటర్లు ఇలాంటి టోర్నీల నుంచే ఐపీఎల్‌లోకి, ఆ తర్వాత జాతీయ జట్టులోకి అడుగుపెట్టారు. యువకులు తర్వాతి స్థాయికి ఎదగడం చూడటానికి సంతోషంగా ఉంది" అని అన్నాడు.