జగన్ హయాంలోనే అన్నీ జరిగితే.. చంద్రబాబు క్రెడిట్ చోరీ ఏంటి?": అవినాశ్ రెడ్డి
- కడప స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు జగన్ హయాంలోనే అన్నీ జరిగాయన్న అవినాశ్
- 2022లోనే 1100 ఎకరాల భూసేకరణ జరిగిందని వెల్లడి
- జగన్‌ను దూషించడానికే కడప సభ పెట్టినట్టుందన్న అవినాశ్
"కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి భూసేకరణ, పర్యావరణ అనుమతులు, జీవోల జారీ అంతా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగితే... ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆ క్రెడిట్ నాదే అని చెప్పుకోవడం హాస్యాస్పదం" అని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శించారు. శనివారం కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం పాత ప్రాజెక్టులపై ‘క్రెడిట్ చోరీ’కి పాల్పడుతోందని మండిపడ్డారు.
2019లోనే జేఎస్‌డబ్ల్యూ సంస్థను కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు జగన్ ప్రభుత్వం ఒప్పించిందని అన్నారు. ఆ తర్వాత 2022లో ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన అధికారిక జీవోలను జారీ చేయడంతో పాటు, ఫేజ్-1 కింద 1100 ఎకరాల భూసేకరణను కూడా పూర్తి చేసిందన్నారు. 2023 ఫిబ్రవరిలో అప్పటి సీఎం జగన్ స్వయంగా ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారని తెలిపారు. పర్యావరణ అనుమతులు సహా అన్ని క్లియరెన్సులు తమ ప్రభుత్వమే తెచ్చిందని.. ఈ విషయాన్ని జేఎస్‌డబ్ల్యూ అధినేత సజ్జన్ జిందాల్ స్వయంగా ప్రకటించారని తెలిపారు. తాజాగా కడప సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ.. ఆ సభ స్టీల్ ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం కాకుండా, కేవలం జగన్‌ను దూషించడానికే పెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
ఇదే క్రమంలో అమరావతి రాజధానిపైనా అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి అనేది రాష్ట్ర ప్రజలందరి రాజధాని కాదని, అది కేవలం ఒక వర్గానికి చెందిన రాజధానిగా మారిందని ఆరోపించారు. ఈ విషయాన్ని స్వయంగా డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా గతంలో అంగీకరించారని అన్నారు. నాడు శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన శాస్త్రీయ సూచనలను తుంగలో తొక్కిన చంద్రబాబు... ఇప్పుడు అమరావతి కోసం ఏకంగా రూ.2 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథాగా ఖర్చు చేయాలని చూస్తున్నారన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా జగన్... మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను అనుసంధానిస్తూ, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఉపయోగపడే ఆచరణాత్మకమైన 'మావిగన్' నమూనాను ప్రతిపాదించారని చెప్పారు.