రామ మందిరం తర్వాత బద్రీనాథ్‌లోనూ కానుకల వివాదం.. విచారణకు ఆదేశాలు

Badrinath Temple donation controversy probe ordered after Ram Mandir row
  • బద్రీనాథ్‌ ఆలయ కానుకలపై అక్రమాల ఆరోపణలు
  • బీకేటీసీ ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు
  • ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు నోటీసులు
  • తప్పు తేలితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక
  • సోషల్‌ మీడియా ప్రచారాన్ని నమ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి
అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ.. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ఆలయంలోనూ ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. శ్రీ బద్రీనాథ్‌ ధామ్‌లో భక్తులు సమర్పించిన కానుకల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతుండటంతో బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ టెంపుల్‌ కమిటీ (బీకేటీసీ) అధికారిక విచారణకు ఆదేశించింది.

బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్‌ ద్వివేది ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. వాస్తవాలను వెలికితీసేందుకు ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు నోటీసులు జారీ చేసి వివరణ కోరినట్లు చెప్పారు.

విచారణలో ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హేమంత్‌ ద్వివేది స్పష్టం చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ణయాలకు రావద్దని, సోషల్‌ మీడియాలో వస్తున్న నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

తన వ్యక్తిగత కార్యదర్శిగా ఒక ఉద్యోగి పనిచేస్తున్నాడనే ప్రచారాన్ని కూడా హేమంత్‌ ఖండించారు. తనకు వ్యక్తిగత కార్యదర్శి ఎవరూ లేరని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆలయ కమిటీలో సాధారణ ఉద్యోగి మాత్రమేనని తెలిపారు. గత ముగ్గురు అధ్యక్షుల హయాంలోనూ అదే ఉద్యోగి విధులు నిర్వహించాడని చెప్పారు.

విచారణ నివేదిక వచ్చిన తర్వాతే ఆరోపణల్లో నిజానిజాలు వెల్లడవుతాయన్నారు. దాని ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని బీకేటీసీ స్పష్టం చేసింది.
Badrinath Temple
BKTC
Hemant Dwivedi
Donation Mismanagement
Uttarakhand
Ram Mandir Controversy

More Telugu News