ప్రియాంక గాంధీ వదిన వర్సెస్ 90 ఏళ్ల వృద్ధురాలు.. ఉత్తరాఖండ్ భూవివాదంపై బీజేపీ దాడి!

Saira Vadra vs 90 year old woman BJP attacks Priyanka Gandhi over Uttarakhand land dispute
  • ఉత్తరాఖండ్‌లో 4 హెక్టార్ల భూవివాదం
  • సాయిరా వాద్రా, నస్రీన్ మధ్య ల్యాండ్ ఫైట్
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్మాహుతి హెచ్చరిక
  • రాబర్ట్ వాద్రా బంధువులపై బీజేపీ ఆరోపణలు
  • ఉత్తరాఖండ్ హైకోర్టు సీరియస్ ఆదేశాలు
ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్‌లో ఉన్న 4 హెక్టార్ల వివాదాస్పద భూమి చుట్టూ సాగుతున్న భూ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా వదిన సాయిరా వాద్రా.. మరణించిన భూ యజమాని కుల్సుమ్ ఖాన్ సోదరి, 90 ఏళ్ల వృద్ధురాలు నస్రీన్ సంగాల మధ్య ఈ ఆస్తి తగాదా నడుస్తోంది. కుల్సుమ్ ఖాన్ 2025 డిసెంబర్‌లో అవివాహితగా చనిపోవడంతో, ఆమె ఆ భూమిని విల్లు ద్వారా తనకు రాసిచ్చిందని సాయిరా వాద్రా వాదిస్తుండగా... తానే అసలైన వారసురాలినని నస్రీన్ పేర్కొంటున్నారు.

ఈ సివిల్ కోర్టు వివాదం పెండింగ్‌లో ఉండగానే, నస్రీన్ తన అనుచరులతో కలిసి ఫామ్‌హౌస్‌లోకి చొరబడి కార్మికులను వెళ్లగొట్టి భూమిని స్వాధీనం చేసుకున్నారని సాయిరా వాద్రా ఆరోపించారు. దీనిపై కిచ్చా కాంగ్రెస్ ఎమ్మెల్యే తిలక్ రాజ్ బెహర్ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ఫామ్‌హౌస్ వెలుపల భారీ నిరసనకు దిగారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు యంత్రాంగం సహకరిస్తోందని ఆరోపిస్తూ భూమిని సీల్ చేయాలని డిమాండ్ చేశారు. 

పోలీసులు నిరసనకారులను అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం పక్షపాతంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్మాహుతి చేసుకుంటానని హెచ్చరించారు. ఈ వివాదం దిల్లీకి చేరడంతో, సాయిరా వాద్రా ద్వారా ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాలు భూకబ్జాకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారీ సంచలన ఆరోపణలు చేశారు.

మరోవైపు, ఈ వ్యవహారంపై ఉత్తరాఖండ్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సివిల్ కోర్టు ఇప్పటికే జూన్ 11న తాత్కాలిక స్టే (ఇంజంక్షన్) ఇచ్చినప్పటికీ, మళ్లీ భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 164 కింద సమాంతరంగా ఎగ్జిక్యూటివ్ చర్యలు ప్రారంభించడంపై జస్టిస్ ఆలోక్ మహ్రా నేతృత్వంలోని ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు విరుద్ధమైన ఆదేశాలకు దారితీస్తాయని కోర్టు పేర్కొంది. జులై 6న కిచ్చా ఎస్డీఎం, ఎస్‌హెచ్‌వోలు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై దీనిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు యంత్రాంగం తటస్థంగా ఉంటుందని అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ పంకజ్ ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు.
Saira Vadra
Priyanka Gandhi Vadra
Uttarakhand Land Dispute
BJP vs Congress
Udham Singh Nagar Property
Robert Vadra Family

More Telugu News