రావణ్ నాలుగోసారి అరెస్ట్.. అదుపులోకి తీసుకున్న పాయకరావుపేట పోలీసులు
- పవన్ కల్యాణ్‌ను దూషించారంటూ రావణ్‌పై ఏపీలో పలు కేసుల నమోదు
- నిన్న రాత్రి బెయిల్ మంజూరు చేసిన మచిలీపట్నం మొబైల్ కోర్టు
- మరో కేసులో వెంటనే అదుపులోకి తీసుకున్న పాయకరావుపేట పోలీసులు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను దూషించిన కేసులో యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌పై రాష్ట్రంలో పలు చోట్ల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వరుసగా నాలుగోసారి అరెస్టయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోర్టు నిన్న రాత్రి అతనికి బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే... అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు మచిలీపట్నంలోనే అతన్ని మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం... జూన్ 30న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హిందుత్వవాది రాధా మనోహర్ దాస్‌లను లక్ష్యంగా చేసుకుని జోసెఫ్ రావణ్ తన యూట్యూబ్ ఛానల్లో అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు అప్లోడ్ చేశారు. దీనిపై కూటమి శ్రేణులు, జనసేన నేతలు రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. తొలుత పిఠాపురం పోలీసుల ఫిర్యాదుతో గత బుధవారం హైదరాబాద్‌లో అరెస్టయిన రావణ్‌కు అక్కడి కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే, ఆ వెంటనే కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు మరో కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. ఆ కేసులోనూ బెయిల్ లభించింది.
ఇదే క్రమంలో నిన్న ఉదయం కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు పాత కేసుల ఆధారంగా రావణ్‌ను అదుపులోకి తీసుకుని, ఇనగుదురు పోలీస్ స్టేషన్లో విచారించారు. అనంతరం నిన్న రాత్రి మచిలీపట్నం మొబైల్ కోర్టు జడ్జి ఎదుట హాజరపర్చగా... రావణ్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు విన్న న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది.
కానీ, ఒంగోలుతో పాటు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఇప్పటికే అక్కడ కేసులు నమోదు కావడంతో... మచిలీపట్నం కోర్టు బయట అడుగుపెట్టిన వెంటనే పాయకరావుపేట పోలీసులు అతన్ని మళ్లీ అరెస్ట్ చేశారు. జోసెఫ్ రావణ్‌ను నేడు పోలీసులు స్థానిక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.