మానవ మెదడుతో మైండ్ గేమ్స్ ఆడుతున్న ఏఐ.. మీరు చూసేవన్నీ నిజాలు కావు!

Artificial Intelligence plays mind games with human brain what you see is not real
  • తప్పుడు జ్ఞాపకాలు సృష్టిస్తున్న ఏఐ
  • ఎంఐటీ పరిశోధనలో సంచలన నిజాలు
  • చాట్‌బాట్‌లతో జ్ఞాపకాలు మారే ప్రమాదం
  • కోర్టులు, జర్నలిజానికి కొత్త సవాళ్లు
మనం కళ్లారా చూసిన విషయాలను, మన మెదడులో భద్రంగా ఉన్న జ్ఞాపకాలను సైతం కృత్రిమ మేధ పూర్తిగా మార్చేయగలదని 'మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (ఎంఐటీ) పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఏఐ ఎడిట్ చేసిన ఫోటోలు, వీడియోలు మనుషులలో జరగని సంఘటనలను కూడా నిజంగానే జరిగాయనే భ్రమను కల్పిస్తున్నాయని, పైగా ఆ తప్పుడు జ్ఞాపకాలపై ప్రజల్లో నమ్మకం మునుపటి కంటే చాలా బలంగా ఉంటోందని సైకాలజిస్ట్ ఎలిజబెత్ లోఫ్టస్, పరిశోధకుడు పాట్ పటారనుతపోర్న్ నేతృత్వంలోని ఎంఐటీ బృందం వెల్లడించింది. కంప్యూటింగ్ సిస్టమ్స్‌పై జరిగిన 'సీహెచ్ఐ కాన్ఫరెన్స్'లో ఈ పరిశోధన వివరాలను సమర్పించారు.

ఈ పరిశోధనలో భాగంగా 200 మందిని నాలుగు గ్రూపులుగా విభజించి, వారికి ఏఐ ఎడిట్ చేసిన ఫోటోలు, వీడియోలను చూపించారు. ఏఐ ఎడిట్ చేసిన ఫోటోల ఆధారంగా రూపొందించిన వీడియోలను చూసిన వారు.. అసలు జరగని విషయాలను కూడా తాము స్వయంగా చూశామని గట్టిగా నమ్మడమే కాకుండా, సాధారణ నియంత్రణ సమూహం కంటే రెండు రెట్లు ఎక్కువగా తప్పుడు జ్ఞాపకాలను నిజమని వాదించారు. కేవలం విజువల్స్ మాత్రమే కాదు, ఏఐ చాట్‌బాట్‌లతో మాట్లాడే సమయంలో కూడా అవి నెమ్మదిగా తప్పుడు వివరాలను మనుషుల మెదడులోకి జొప్పిస్తున్నాయని, గతంలో ఒక లాయర్ అడిగే లీడింగ్ ప్రశ్నలు ఎలాంటి ప్రభావాన్ని చూపేవో, ఇప్పుడు ఒక ఫ్రెండ్లీ ఏఐ చాట్ అంతకంటే ఎక్కువ ప్రమాదకరంగా జ్ఞాపకాలను మార్చేస్తోందని పరిశోధకులు గుర్తించారు.

ముప్పై ఏళ్ల నాటి భయం.. ఇప్పుడు ఏఐ రూపంలో!
నిజానికి మానవ మెదడులో తప్పుడు జ్ఞాపకాలను చొప్పించడం సులువని శాస్త్రవేత్తలకు ముప్పై ఏళ్ల క్రితమే తెలుసు. 1995లో లోఫ్టస్ చేసిన ఒక ప్రయోగంలో.. కొందరు వ్యక్తులు చిన్నప్పుడు షాపింగ్ మాల్‌లో తప్పిపోయినట్లు తప్పుడు కథనాన్ని నమ్మించగా, వారు దానిని నిజమని నమ్మడమే కాకుండా ఆ మాల్ ఎలాంటి వాసన వచ్చింది, తమను ఎవరు కాపాడారు అనే అబద్ధపు వివరాలను కూడా సొంతంగా ఊహించి చెప్పారు. ఈ తప్పుడు జ్ఞాపకాలు మనుషుల ప్రవర్తనను కూడా మారుస్తాయని, చిన్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలు తిని అనారోగ్యం పాలయ్యారని అబద్ధం చెప్తే, వారు పెద్దయ్యాక కూడా ఆయా పదార్థాలను తినడానికి ఇష్టపడరని లోఫ్టస్ వివరించారు.

హార్వే వైన్‌స్టీన్, టెడ్ బండీ వంటి సంచలన కేసుల్లో మెదడు జ్ఞాపకాల విశ్వసనీయతపై కోర్టులకు సేవలందించిన లోఫ్టస్.. ప్రస్తుత ఏఐ సాంకేతికతపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన విషయాలు మెదడులో స్థిరంగా ఉండవని, ప్రతిసారి వాటిని మనం గుర్తుచేసుకున్నప్పుడు మెదడు వాటిని పునర్నిర్మిస్తుందని, ఇప్పుడు ఏఐ టూల్స్ ఆ నిర్మాణాన్ని తప్పుగా మార్చేస్తున్నాయని స్పష్టం చేశారు. మానవ మెదడు అనేది ఒక పక్కా రికార్డర్ కాదని, దానికున్న బలహీనతను ఏఐ టూల్స్ ఇప్పుడు మరింత సులభంగా వాడుకుంటున్నాయని ఈ పరిశోధన హెచ్చరిస్తోంది.
Artificial Intelligence
MIT research
Human memory
Elizabeth Loftus
False memories
AI mind games

More Telugu News