45 రోజులుగా మిస్సింగ్‌.. బాత్రూమ్‌ టైల్స్ కింద శవం.. భార్య అరెస్ట్‌!

Missing for 45 days body found under bathroom tiles wife arrested
  • యూపీలోని ఆగ్రాలో ఘటన
  • హత్య చేసినట్లు భార్య అంగీకరించిందని పోలీసుల వెల్లడి
  • మద్యం సేవించే భర్తతో తరచూ గొడవలయ్యేవని సమాచారం
  • ముందే బాత్రూమ్‌ మరమ్మతులకు ఏర్పాట్లు
  • కుట్రలో మరెవరైనా ఉన్నారా అని దర్యాప్తు
45 రోజులుగా కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి కోసం కుటుంబం వెతుకుతూనే ఉంది. ఎవరూ ఊహించని చోటే అతడి మృతదేహం దాగి ఉండటం పోలీసులను కూడా విస్మయానికి గురిచేసింది. ఇంటి బాత్రూమ్‌ ఫ్లోర్‌ కింద పూడ్చిపెట్టి, పైన కొత్త టైల్స్‌ వేసి ఆనవాళ్లు చెరిపే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో సురేంద్ర కుమార్‌ శర్మ (44) మే 18 నుంచి కనిపించకుండా పోయాడు. భర్త ఎక్కడికో వెళ్లి తిరిగి వస్తాడని భార్య రూబీ కుటుంబ సభ్యులు, పొరుగువారికి చెబుతూ వచ్చింది. మే 26న మిస్సింగ్‌ కేసు నమోదైనా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో కేసుపై పోలీసులు దృష్టి సారించారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు మరోసారి ఇంటిని తనిఖీ చేశారు. ఈ సమయంలో భార్య ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో ఇంట్లో క్షుణ్నంగా సోదాలు చేపట్టారు. బాత్రూమ్‌లో కొత్తగా వేసిన టైల్స్‌, ప్లాస్టరింగ్‌ కనిపించడంతో వాటిని తొలగించారు. ఫ్లోర్‌ కింద పూడ్చిపెట్టిన కుళ్లిపోయిన మృతదేహాన్ని వెలికితీశారు.

ప్రాథమిక విచారణలో హత్య అనంతరం మృతదేహాన్ని బాత్రూమ్‌లో పూడ్చిపెట్టి పైన టైల్స్‌ అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనకు ముందే బాత్రూమ్‌ మరమ్మతుల కోసం మేస్త్రీలు, కార్మికులను ఏర్పాటు చేసినట్లు విచారణలో తెలిసింది. ఈ కుట్రలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

విచారణలో రూబీ హత్య చేసినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. అయితే హత్యకు అసలు కారణం ఏంటి? ఎలా హత్య చేశారు? అనే అంశాలపై ఇంకా విచారణ కొనసాగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన పోలీసులు, ఫోరెన్సిక్‌ ఆధారాలను సేకరించారు.

సురేంద్ర మద్యం సేవించడం వల్ల దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని అతడి సోదరుడు తెలిపాడు. భర్త కనిపించడంలేదని కుటుంబానికి సమాచారం ఇచ్చింది కూడా రూబీయేనని చెప్పారు. వారాల తరబడి వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. చివరకు ఇంట్లోనే మృతదేహం బయటపడటంతో స్థానికంగా సంచలనం నెలకొంది.
Surendra Kumar Sharma
Ruby Sharma
Agra murder case
Body found under bathroom tiles
Uttar Pradesh crime news
Missing man found dead

More Telugu News