E20 పెట్రోల్‌పై వదంతులు నమ్మొద్దు: కేంద్ర ప్రభుత్వం
- E20 పెట్రోల్‌పై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన కేంద్రం
- వాహన ఇంజిన్లకు నష్టమనే వాదనల్లో నిజం లేదని స్పష్టీకరణ
- E20 వాడకంతో కాలుష్యం తగ్గుతుందని వెల్లడి
- వెహికల్ వారెంటీ, ఇన్సూరెన్స్‌కు ఎలాంటి డోకా లేదని భరోసా
E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయని, మైలేజీ గణనీయంగా తగ్గుతుందని, కాలుష్యం పెరుగుతుందని, ఇథనాల్ వాసనకు కీటకాలు ఆకర్షితమవుతాయని, వాహన వారెంటీ లేదా ఇన్సూరెన్స్ వర్తించదంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది.
ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI), ఇండియన్ ఆయిల్, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (SIAM) వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన సాంకేతిక అధ్యయనాలకు ఈ ఆరోపణలు విరుద్ధంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది. వాస్తవానికి, E20 వాడకం వల్ల ద్విచక్ర వాహనాల్లో కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలు 50 శాతం, నాలుగు చక్రాల వాహనాల్లో 30 శాతం వరకు తగ్గుతాయని తెలిపింది. వాహనాల వారెంటీకి ఎలాంటి ఆటంకం కలగదని సియామ్ (SIAM) కూడా స్పష్టంగా ధృవీకరించింది.
ముడి చమురు దిగుమతులు తగ్గించుకోవడం, రైతులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం, కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం గుర్తు చేసింది. ఫ్యూయల్-గ్రేడ్ ఇథనాల్ తయారీలో చక్కెర అవశేషాలు ఉండవని, కాబట్టి కీటకాలు ఆకర్షితమవుతాయనే వాదనలో నిజం లేదని పేర్కొంది. ప్రజలు ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, ధృవీకరించబడిన శాస్త్రీయ సమాచారంపై మాత్రమే ఆధారపడాలని సూచించింది.