బండ్ల గణేష్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. ఆస్తి వేలాన్ని సమర్థించిన న్యాయస్థానం
- యూనియన్ బ్యాంక్ చర్యలను సమర్థిస్తూ డీఆర్‌టీ ఉత్తర్వుల రద్దు
- రుణాల రికవరీలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ఆస్తిని వేలం వేసిన బ్యాంక్
- శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ తీసుకున్న రుణాలకు కుటుంబ సభ్యులు పూచీకత్తు
- రూ.8.51 కోట్లకు అమ్ముడైన ఆస్తి వేలం చెల్లుబాటు అవుతుందని తీర్పు
వివరాల్లోకి వెళ్తే.. బండ్ల గణేష్, ఆయన తండ్రి, సోదరుడు ప్రమోటర్లుగా ఉన్న 'శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ కోసం యూనియన్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలకు పూచీకత్తుగా జూబ్లీహిల్స్‌లోని షేక్‌పేట్‌లో ఉన్న సుమారు 500 గజాల నివాస భవనాన్ని తాకట్టు పెట్టారు. ఈ రుణాలకు సంబంధించి కుటుంబ సభ్యులు వ్యక్తిగత హామీదారులుగా ఉన్నారు.
రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో, సర్ఫేసీ (SARFAESI) చట్టం కింద బ్యాంకు 2019లో ఆస్తిని స్వాధీనం చేసుకుని, 2022లో వేలం వేసింది. ఈ వేలంలో సదరు ఆస్తి రూ. 8.51 కోట్లకు విక్రయించబడింది. అయితే, ఈ వేలాన్ని డీఆర్‌టీ రద్దు చేయడంతో, యూనియన్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ మౌషూమి భట్టాచార్య, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం, బ్యాంకు వాదనలతో ఏకీభవించింది. డీఆర్‌టీ ఉత్తర్వులను రద్దు చేస్తూ, బ్యాంకు చేపట్టిన వేలం ప్రక్రియ చెల్లుబాటు అవుతుందని శుక్రవారం తీర్పు వెలువరించింది. హైకోర్టు తాజా తీర్పుతో బ్యాంకుకు రికవరీ ప్రక్రియలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.