వైట్‌హౌస్‌లో ఒబామా, బైడెన్‌లతో ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షణ?.. ట్రంప్ సంచలన ప్రతిపాదన!
- మాజీ అధ్యక్షులకు ట్రంప్ ఆహ్వానం
- శ్వేతసౌధంలో ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షణ
- సెకండ్ లేడీ పాడ్‌కాస్ట్‌లో వెల్లడి
- బిల్ క్లింటన్‌పై ట్రంప్ ప్రశంసలు
'స్టోరీటైమ్ విత్ ద సెకండ్ లేడీ' అనే పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో భాగంగా వైట్‌హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ ప్రచురించిన 'ప్రెసిడెంట్స్ ప్లే!' అనే పుస్తకాన్ని ట్రంప్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా గతంలో అధ్యక్షులుగా ఉన్నవారు తమ ఖాళీ సమయాన్ని ఎలా గడిపేవారనే విషయాలపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో వైట్‌హౌస్‌లో ఒక అధ్యక్షుడు సూపర్ బౌల్ మ్యాచ్ లైవ్ వీక్షణను హోస్ట్ చేస్తున్న పేజీని చూసిన ట్రంప్.. తనకు ఒక ఆలోచన వచ్చిందని చెప్పారు. "బరాక్ హుస్సేన్ ఒబామా, జో బైడెన్, బుష్‌లను కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి వైట్‌హౌస్‌కు ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? ఇదొక అద్భుతమైన స్టోరీ అవుతుంది కదా, దీనికి ప్రెస్ ఊగిపోతుంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై ఉషా వాన్స్ స్పందిస్తూ.. "ప్రెసిడెంట్స్ రీయూనియనా? చాలా సరదాగా ఉంటుంది" అని అన్నారు. బహిరంగ సభల్లో ఒబామా, బైడెన్‌లపై నిరంతరం విమర్శలు గుప్పించే ట్రంప్ నుంచి ఇలాంటి ప్రతిపాదన రావడం విశేషం.
ఈ పుస్తకాన్ని చదువుతున్నంత సేపు ట్రంప్ గత అధ్యక్షులపై పలు ఆసక్తికర, హాస్యభరిత వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్‌లో రన్నింగ్ ట్రాక్ నిర్మించుకున్న మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. "క్లింటన్ మంచి వ్యక్తి, నాకు ఆయనంటే చాలా ఇష్టం, ఇప్పటికీ ఇష్టమే. కానీ నేను మాత్రం వైట్‌హౌస్‌లో రన్నింగ్ ట్రాక్ నిర్మించే పని ఎప్పటికీ చేయను" అంటూ నవ్వులు పూయించారు. అలాగే అమెరికాకు అత్యంత భారీ కాయుడైన అధ్యక్షుడిగా గుర్తింపు పొందిన విలియం హోవార్డ్ టాఫ్ట్ బేస్‌బాల్ ఆడుతున్న చిత్రాన్ని చూసి.. "ఆయన చాలా లావుగా ఉండేవారు, బేస్‌బాల్ మ్యాచ్‌లలో హాట్ డాగ్స్ తినడం ఆయనకు ఇష్టం. మన దేశానికి ఆయనే అత్యంత బరువైన అధ్యక్షుడు. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆయన రికార్డును నేను బద్దలు కొట్టాలని అనుకోవడం లేదు" అంటూ చమత్కరించారు. వైట్‌హౌస్‌లో ఉండేది తక్కువ కాలమే అయినా, ప్రజల కోసం కష్టపడి పనిచేయడమే ఒక గౌరవంగా భావిస్తానని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు.