పుణే హత్య కేసులో కొత్త ట్విస్ట్.. నిందితుడి గురించి మేనమామ కీలక వ్యాఖ్యలు

Ketan Agarwal murder case takes a new twist with mutual accusations
  • పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక విషయాల వెల్లడి
  • నిందితుడు చేతన్ చాలా నిజాయతీపరుడంటూ అతడి మేనమామ వ్యాఖ్య
  • హత్యకు ముందు నిందితులు రిహార్సల్ చేశారన్న పోలీసులు
  • విచారణకు తీసుకెళ్తుండగా మీడియాకు మధ్యవేలు చూపిన ప్రధాన నిందితురాలు సియా
పూణెలో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు నిందితులు ఆన్‌లైన్‌లో సమాచారం వెతకడమే కాకుండా, నేరం ఎలా చేయాలో రిహార్సల్ కూడా చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మరోవైపు, ఈ కేసులోని ప్రధాన నిందితుడు చేతన్ చౌదరి చాలా మంచివాడని, అతడిపై వస్తున్న ఆరోపణలు నమ్మశక్యంగా లేవని అతడి మేనమామ ఉదారం చౌదరి అన్నారు.

ఈ కేసు వివరాలను ఉదారం చౌదరి శుక్రవారం మీడియాతో పంచుకున్నారు. "చేతన్ చాలా నిజాయతీ గల కుర్రాడు. సరళమైన స్వభావంతో, ఎప్పుడూ నవ్వుతూ అందరితో స్నేహంగా ఉంటాడు. అతను ఏ అమ్మాయితోనైనా సన్నిహితంగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు. మా కుటుంబానికి ఇది పెద్ద దిగ్భ్రాంతి కలిగించింది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

చేతన్ గురించి మీడియాలో మేం చాలా వింటున్నామని, కానీ అసలు విషయం మా కుటుంబానికి  మాత్రమే తెలుసని అన్నారు. అతను ఏ అమ్మాయితో కూడా కారులో కూర్చోవడం లేదా మాట్లాడటం తాము చూడలేదని అన్నారు. అమ్మాయిలతో మాట్లాడేందుకు చేతన్ పక్కకు వెళ్లడాన్ని కూడా తాను చూడలేదని అన్నారు. 

చేతన్ అద్భుతమైన క్రికెటర్ అని వెల్లడించారు. అతడు కొట్టే భారీ షాట్లు చూడడానికి చాలామంది మైదానానికి వచ్చేవారని గుర్తుచేసుకున్నారు. చేతన్ తండ్రి మూడున్నర దశాబ్దాలుగా పుణేలో నివసిస్తున్నారని తెలిపారు. వారు డ్రైఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. అవసరమైనప్పుడు తాను వారికి సహాయం చేసేవాడినని అన్నారు.

పోలీసుల కథనం ప్రకారం, కేతన్‌కు కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడిగా భావిస్తున్న చేతన్ చౌదరి కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు. లోహగఢ్ కోట వద్ద కొండ అంచు నుంచి కేతన్‌ను కిందకు తోసేసి చంపారని ఆరోపణలు ఉన్నాయి. హత్యకు ముందు ఇద్దరూ ఆ ప్రదేశానికి వెళ్లి రిహార్సల్ చేశారని, పట్టుబడ్డాక పోలీసులకు ఏం చెప్పాలో కూడా ముందే ప్రాక్టీస్ చేసుకున్నారని విచారణ అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ప్రధాన నిందితురాలు సియా గోయల్ ప్రవర్తన వివాదాస్పదమైంది. గురువారం పోలీసులు ఆమెను విచారణకు తీసుకెళుతుండగా, బయట ఉన్న మీడియా ప్రతినిధుల వైపు అసభ్యకరంగా మధ్యవేలు చూపించింది. ఈ దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అవ్వడంతో, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రవర్తనపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Ketan Agarwal
Siya Goyal
Chaitanya Chaudhary
Ketan Agarwal murder case
Lohagad Fort murder Pune

More Telugu News