అభ్యంతరకర కంటెంట్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన ప్రీతి జింతా

Preity Zinta approaches court against objectionable deepfake content
  • ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతున్న ప్రీతి జింతా మార్ఫింగ్ కంటెంట్
  • అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించాలంటూ బాంబే హైకోర్టులో ప్రీతి పిటిషన్
  • ప్రతివాదులుగా గూగుల్, మెటా వంటి దిగ్గజాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సృష్టించిన డీప్‌ఫేక్ చిత్రాలు, మార్ఫింగ్ చేసిన అసభ్యకర కంటెంట్‌కు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి ప్రీతి జింతా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతున్న ఈ అభ్యంతరకర కంటెంట్‌ను తక్షణమే తొలగించేలా అత్యవసర ఆదేశాలు ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. వెబ్‌సైట్ల నుంచి ఇలాంటి తప్పుడు కంటెంట్‌ను తొలగించడానికి ఒక ఆచరణాత్మక విధానాన్ని (ప్రాక్టికల్ ప్రోటోకాల్‌) రూపొందించాలని ఆదేశించింది.


ప్రీతి జింతా దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో గూగుల్, మెటా వంటి దిగ్గజాలతో పాటు డొమైన్ నేమ్ రిజిస్ట్రార్లను ప్రతివాదులుగా చేర్చారు. నటి తరఫు సీనియర్ న్యాయవాది వెంకటేశ్ ధోండ్ వాదనలు వినిపిస్తూ.. రోజురోజుకూ ఈ ఏఐ డీప్‌ఫేక్ చిత్రాల నాణ్యత పెరుగుతోందని, కొన్ని చిత్రాలు నిజమే అనిపించేలా ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలి గౌరవానికి భంగం కలగకుండా ఆ లింకులను వెంటనే తొలగించాలని కోరారు.


గూగుల్, మెటా సంస్థల న్యాయవాదులు స్పందిస్తూ.. వివాదాస్పద లింకులను తొలగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే సాధారణ చట్టబద్ధమైన కంటెంట్‌ను ముందస్తుగా అడ్డుకోవాలనే కఠిన నిబంధనలను విధించవద్దని అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సాధారణ వినియోగదారుల కంటెంట్‌కు ఇబ్బంది లేకుండా, కేవలం అభ్యంతరకర లింకులను మాత్రమే వేగంగా తొలగించేలా ప్రోటోకాల్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను కోర్ట ఈ నెల 6కు వాయిదా వేసింది.

Preity Zinta
Deepfake AI content
Bombay High Court
Google Meta lawsuit
Morphing photos
Preity Zinta legal case

More Telugu News